
తిరుమల నడక మార్గంలో భక్తుల రక్షణ చర్యలపై టీటీడీ సీరియస్గా దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు కర్రల పంపిణీకి టీటీడీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
కర్రలు ఇవ్వడంతోనే భక్తుల భద్రత బాధ్యతలు తీరిపోయినట్టు కాదని, కొంత వరకూ ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చేందుకు దోహదం చేస్తాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.నడక దారి భక్తులు క్రూరమృగాల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు.
ఇప్పటికే మూడు నెలల కాలంలో ఐదు చిరుతలను టీటీడీ, అటవీఅధికారులు సంయుక్తంగా పని చేసి పట్టుకున్నారు. మరిన్ని చిరుతలు సంచరిస్తున్నాయని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టారు. దీంతో నడక దారి భక్తులకు రక్షణ కల్పించేందుకు కంచె ఏర్పాటుకు టీటీడీ కసరత్తు చేస్తోంది.ఇనుప కంచె ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని టీటీడీ కోరింది.