
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
విషయం: యూరియా కొరత గురించి..
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని 2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ సాక్షిగా మీరు రైతులకు ఇచ్చిన మాట. అన్ని హామీలు మాదిరిగానే ఈ మాటకు దిక్కు లేకుండా పోయింది. ఆరు నూరు అవుతుందేమో కానీ మీరు మాట మీద నిలబడడు అని మరో సారి నిరూపితమైంది. ఉచిత ఎరువులు అని రెైతుల చెవిలో మీరు పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయి.
కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉచిత ఎరువులు సంగతేమో కానీ, పైసలిచ్చి కొందామనుకున్న ఎరువులు దొరక్క అల్లాడే పరిస్థితి రైతులది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వానాకాలం వరి నాట్లు ముగింపు దశకు వచ్చాయి. వరి నాటిన 20, 25 రోజులకు యూరియా వేయాలి. లేదంటే నాటు పచ్చబడదు. పత్తికూడా పూత, కాత దశ లో ఉంది. పత్తి మొక్కకు కొమ్మలు వచ్చే సమ యం ఇది. ఇటీవల వర్షాలు లేక పత్తి మొక్కలు వాడాయి. పత్తి మొక్కలకు కూడా కాంప్లెక్స్, యూరియా కలిపి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరణంలో 20 రోజులకు పైగా ఉమ్మడి జిల్లాల్లోని ఎరువుల దుకాణాల్లో యూరియా స్టాక్ లేదంటున్నారు. దీంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఒక్కో రైతుకు 20 నుంచి 30 బస్తాలు అవసరం ఉండగా, కేవలం ఒకటి నుంచి ఐదు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు లబోదిబో మంటున్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి సొంత జిల్లా, రాష్ట్రంలో సాగుకు కీలకమైన సాగర్ ఆయకట్టు ప్రాంతాలైన సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. వర్షాలు సరిగా లేక, నాగార్జునసాగర్ కాలువ నీళ్లు రాక, బోర్లు బావుల కింద గతేడాది కంటే తక్కువగా వరి పంట సాగు చేశారు. అయిన సరిపడ యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం, నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో, కల్లూరు, మేడారం, దాసారం, ఎల్లారం, నాగార్జనసాగర్ పరిధిలోని హాలియా ప్రాంతాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాంలు, ప్రైవేట్ షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. లైన్లో చెప్పులు పెట్టి మరీ వేచి చూడాల్సిన దుస్థితి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో 300 మందికి గాను కేవలం వంద మంది రైతులకు మాత్రమే యూరియా దొరికింది.
సీఎం సొంత జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలోని రైతులు యూరియ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల పాటు తిరిగినా దొరకడం లేదని వాపోతున్నారు.
సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నా పట్టించుకునే స్థితిలో మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. బాధ్యత వహించాల్సిన వ్యవసాయ మంత్రి పత్తా లేకుండా పోయిండు. ఇంత జరుగుతున్న స్పందించే తీరిక రైతు బాంధవుడు అని చెప్పుకునే మీకు లేదు. ఎంత సేపు ఓట్లు, సీట్లు తప్ప రైతుల గోస పట్టదు.
ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా కనీసం 2 లక్షల టన్నుల అవసరం ఉండగా.. ఇప్పుడు లక్షా 10 టన్నులే బఫర్ స్టాక్ మాత్రమే ఉంది. ఫలితంగా రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడింది. వర్షాలు పడుతున్నా పలు ప్రాంతాల్లో పంటలకు వేయడానికి యూరియా లేదు. వినియోగం గణనీయంగా పెరుగడంతో ఇప్పుడున్న నిల్వలు సరిపోతలేవు.
ప్రతి సీజన్లో యూరియా, ఎరువుల కొరత రైతులను వేధిస్తూనే ఉంది. తెలంగాణ వచ్చినప్పటీ నుంచి ఈ సమస్య జఠిలమవుతున్న..రైతు బంధు పేరు చెప్పి మీ ప్రభుత్వం ఈ విషయాన్ని తెలివిగా పక్కా దారి పట్టిస్తుంది.
ఎరువులు దొరక్క ప్రతి సీజన్లో రైతులు కష్టాలే పడుతున్నారు. ప్రతిసారి పుష్కలంగా ఎరువులు ఉన్నాయంటూ ముందుగానే ప్రకటించుకుంటున్న వ్యవసాయ శాఖ తీరా సమయంలో చేతులెత్తేస్తోంది. ఎరువులు దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2019లో మీ సొంత జిల్లా మెదక్.. దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య గుండె… క్యూలైన్లో ఆగిపోయింది. అయిన ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. సీజన్లో డిమాండ్ కు అనుగుణంగా యూరియా నిల్వలు చేయాలనే సోయి, ముందు చూపు లేకుండా మీ గుడ్డి ప్రభుత్వానికి. గట్టిగా ప్రశ్నిస్తే అన్నింటికీ రైతు బంధు ఒక్కటే పరిష్కారం అంటూ మురిపిస్తోంది.
మీ ప్రభుత్వ ప్రణాళిక లోపం, విధానరాహిత్యం కారణంగా తెలంగాణలో వ్యవసాయ రంగం దయనీయంగా తయారైంది. నిపుణుల సూచనలు పట్టించుకోకుండా మీరు ఇష్టారాజ్యంగా సాగిస్తున్న పాలన కారణంగా అన్నదాతలు సంక్షోభంలో చిక్కుకున్నారు. ఇప్పటికైనా ఓట్లు, సీట్లు అంటూ రాజకీయాలు చేయడం మాని రైతులు పడుతున్న గోసను తీర్చేందుకు ప్రయత్నించాలి. తక్షణమే అధికారులను అదేశించి యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా రైతులకు సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత మీపైన ఉంది. రాష్ట్రంలోని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు దిగుతుందని హెచ్చరిస్తున్నా.
డిమాండ్లు
• రైతులకు సరిపడా యూరియాను అందించాలి.
• రైతులు అడిగినంత యూరియాను అందుబాటులో ఉంచాలి.
• రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత లేకుండా చూడాలి.
• యూరియా కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు, ఏఐఎస్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించాలి.