
మణిపూర్లో ఆదివాసీలకు అండగా నిలిచేందుకు ఈ నెల 3న తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. గాంధీభవన్లో జరిగిన పీసీలో ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆదివాసీల మీద జరుగుతున్న దాడులను కొన్ని రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయన్నారు. అందుకే తాము ఢిల్లీలో నిరసనతోపాటు దేశవ్యాప్తంగా ఆదివాసీల్లో స్థైర్యం నింపేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆగస్టు 6న ఆదివాసీ తండాల్లో బస చేస్తామన్నారు. 7వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 8న సాయంత్రం కాగడాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఆదివాసీ దినోత్సవమైన 9న ఆదివాసీ కవాతు, ఆదివాసీ మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్లో రాష్ట్రంలో ఒక సభ ఏర్పాటు చేసి ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటిస్తామని వెల్లడించారు.