
అయుత చండి మహా యాగం గతంలో కెసిఆర్ పెద్ద ఎత్తున నిర్వహించిన విషయం, దానికి అపూర్వ స్పందన వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. హైదరాబాదుకు 60 కిలో మీటర్ల దూరంలో మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామంలో ఈ మహా యాగాన్ని అప్పుడు ఐదురోజుల పాటు నిర్వహించారు. ఈ యాగాన్ని కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, విశ్వజనీన శాంతి లక్ష్యంగా నిర్వహించినట్టు ఆనాడు ముఖ్యమంత్రి కెసి ఆర్ చెప్పినదీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణా ఉద్యమం తీవ్రదశకు చేరుకున్న సమయంలో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అయుత చండీ యాగం చేస్తానని మొక్కుకున్నట్టు కెసిఆర్ ఆనాడు చెప్పారు. అంతేకాదు ప్రజల శాంతి సౌభాగ్యాల కోసమే తప్ప ఎలాంటి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు దీని వెనుక లేవని కూడా కెసిఆర్ అప్పుడు చెప్పుకొచ్చారు.

అయితే ఈ అయుత చండీ మహాయాగాన్ని ఇపుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి చేయడంతో ఆ యాగం మళ్లా వార్తల్లో నిలిచింది. ఎందుకు ఆమె ఈ యాగం నిర్వహించారన్నదానిపై రాష్ట్రలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. అలా ఈ యాగం ప్రత్యేకత ఏమిటన్నదానిపై పలువురిలో ఉత్సుకత ఎక్కువైంది.

అయుత చండీ మహా యాగం అంటే ఏమిటి అనే దానిపై మరోసారి చాలామందిలో ఆసక్తి బాగా పెరిగింది. ఈ యాగం ఎంతో పురాతనమైన పూజా విధానం. చండి లేదా దుర్గా దేవి అనుగ్రహం, ఆశీర్వచనాలు పొందేందుకు దీన్ని చేస్తారు. సృష్టి స్థాపనకు కారకురాలైన మాతగా దుర్గాదేవిని నమ్ముతాం. అయుత అంటే సంస్కృతంలో పదివేలు అని అర్థం. ఈ యాగంలో దుర్గా సప్తశతి శ్లోకాలను పదివేల పర్యాయాలు చదువుతారు. అలా పదవ పర్యాయం దుర్గామాతను ప్రార్థిస్తూ శ్లోకాలు చదివి సమయంలో హోమం లేదా అగ్నిదేవుడికి పాయసం సమర్పిస్తూ పెద్ద ఎత్తున పూజ చేస్తారు. దుర్గా సప్తశతి (సప్త అంటే ఏడు అని అర్థం. శతి అంటే సంస్కృతంలో వంద అని అర్థం) మార్కండేయ పురాణంలో అంతర్భాగం. ఇందులోని మొత్తం 13 చాప్టర్లలో 700 శ్లోకాలు ఉంటాయి. దుర్గామాత ఎందరో రాక్షసులను ఎలా ఓడించిందో వివరిస్తూ ఈ దుర్గా సప్తశతి సాగుతుంది.

ఈ సప్తశతితో పాటు చండి నవాక్షరి మంత్రాన్ని కూడా ఐదు రోజుల్లో పది మిలియన్ల సార్లు పఠించాల్సి ఉంటుంది. ఈ మహాయాగంలో భాగంగా సర్వ దేవతామూర్తులనూ ఆహ్వానిస్తూ ప్రార్థనలు చేస్తారు. విఘ్న నాశనుడైన గణేశునితో మొదలెట్టి శివ, విష్ణు, బ్రహ్మ, లక్ష్మీ, సరస్వతి, భైరవ ఇలా ఎందరో దేవతలను తలుస్తూ ప్రార్థనలు చేస్తారు. ఈ చండీ మహాయాగంలో అంతర్భాగంగా చేయవలసిన డజన్ల కొద్దీ మరెన్నో ఉప ఆచారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో అనుగ్ఘ సంకల్పం అని ఉంటుంది. అంటే ఈ యాగం నిర్వహించడానికి దుర్గాదేవి అనుమతిని తీసుకోవడం అనమాట.

తర్వాత పుణ్యావాచనం, పవిత్రస్నానం, కలశ స్థాపన, కన్య పూజ, గోపూజ, బ్రహ్మచారి పూజ, సుమంగళ ద్రవ్యాహుతి వంటివెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ చేయాలి. యాగం చివరి రోజున పూర్ణాహుతి ఆచారం ఉంటుంది. దీంట్లో పన్నెండు టన్నుల పాయసం చేస్తారు. ఆ పాయసాన్ని మోదుగ సమిధల మీద ప్రత్యేకంగా వండుతారు. పూర్ణాహుతి సందర్భంగా కొబ్బరికాయలు, వక్కపొడి, తమలపాకులు, కుంకుమ, పసుపు, పూలు, పళ్లు, నాణాలు, మూలికలు వంటివి కూడా సమర్పిస్తారు.