
ప్రభుత్వ వైద్యుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా ఆస్పత్రి వద్ద ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వైద్య ఆస్పత్రికి చెందిన డాక్టర్లు సిబ్బంది పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించి మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధుల బృంద సభ్యులు మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డి.యం.ఈ పరిధిలో పనిచేసే వైద్యులకు పిఆర్సి ఏరియర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 142 ను వెంటనే రద్దు చేయాలని, ప్రజారోగ్య విభాగంలో టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ పోస్టులు రద్దు చేయడం సమంజసం కాదని అన్నారు.

వైద్య విధాన పరిషత్ ను సెకండరీ హెల్త్ సర్వీసెస్ మార్చి ట్రెజరీ ద్వారా జీతాలు హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో ప్రతి జిల్లాకు డిసిహెచ్ఎస్ పోస్ట్ క్రియేట్ చేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 142 ద్వారా ఏ.డి.పి.హెచ్.ఓ లకు దొడ్డి దారిన కేటాయించిన 10 డి.ఎం.హెచ్.ఓ పోస్టుల ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని జనరల్ సీనియార్టీ ప్రకారం జిల్లాలలో ప్రోగ్రాం ఆఫీసర్లు గా అవకాశం కల్పించాలని కోరారు. ప్రజారోగ్య విభాగంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు హామీ ఇచ్చిన మేరకు ఎమర్జెన్సీ అలవెన్స్ 20,000గా వెంటనే ప్రకటించాలని, ప్రోటోకాల్ జీవో మరియు ఇతర అలవెన్స్ లకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూడు షిఫ్టులకు అనుగుణంగా వైద్యుల సంఖ్య పెంచాలని, ఇప్పుడు పెరుగుతున్న పని ఒత్తిడికి సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.