
24 గంటల నిరాహార దీక్ష విరమణ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
తెలంగాణ ఉద్యమ లక్ష్యాలైన ‘నియామకాల’ విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానం పట్ల తెలంగాణ యువతలో ఆందోళన నెలకొంది.ఈ ఆందోళన నేపథ్యంలో వారికి అండగా నిలవడంతోపాటు.. మేమున్నామనే భరోసా కల్పించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు.
ఈ దీక్ష ప్రభుత్వంలో కలవరాన్ని రేపింది. ఈ దీక్షకు యువత నుంచి పెద్దసంఖ్యలో మద్దతు లభిస్తుండటంతో.. కేసీఆర్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడింది.పోలీసులను పంపి.. ఇందిరాపార్క్ దగ్గర ధర్నాస్థలం ఖాళీ చేయించేందుకు.. బలవంతంగా కిషన్ రెడ్డిని పార్టీ కార్యాలయానికి తరలించింది.
జవదేకర్..కిషన్ రెడ్డి గారి సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నాను.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువను కూడా అభినందిస్తున్నాను.ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్ కు చూపించాం. కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. నిన్న కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తే.. కేసీఆర్ సర్కారుకు ప్రాబ్లం ఏంటి. కేసీఆర్ భయపడ్డాడు. అందుకే పోలీసులను పంపించి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేశాడు.తెలంగాణ యువతను మోసం చేశామనే విషయం వారికి కూడా తెలుసు. అందుకే భయం.. యువతకేసీఆర్ ను తొలగించాలి..తెలంగాణను బతికించుకోవాలి..ఇంకా చేయాల్సింది చాలా ఉంది.వంద రోజుల సమయం మన దగ్గర ఉంది. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే ఉద్యమాన్ని కొనసాగిద్దాం అని అన్నారు
కిషన్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అక్రమ పాలనకు సంబంధించి..డబుల్ బెడ్రూం ఇండ్లు, యువతకు ఉద్యోగాలు, ధరణి సమస్యలు.. ఇలా చాలా సమస్యల మీద మనం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసు సహాయంతో ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో సెక్రటేరియట్ గేట్ ఎదుట ధర్నాలు చేసేవాళ్లం.ఆ తర్వాత ధర్నాచౌక్ కు నిరసన కార్యక్రమాల వేదికను మార్చారు.ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలకు, మహిళా సంఘాలకు.. వారి నిరసన తెలిపే హక్కు లేకుండా పోయింది.తెలంగాణ ప్రజల హక్కులు కాలరాస్తున్న దుర్మార్గుడు కేసీఆర్.నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. కానీ.. తెలంగాణలో మాత్రం నిరసన తెలిపే హక్కు లేదు.ఏ సంఘాలైతే పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందో.. ఆ సంఘాన్నీ కనబడకుండా పోయాయి.బయట ఉద్యమాలు చేయొద్దు.. అసెంబ్లీలో మాట్లాడొద్దు.నాలుగైదు రోజులు నడిచే అసెంబ్లీలో.. ప్రజల సమస్యలు లెవనెత్తితే మైక్ కట్.ఇదేమైనా నిజాం రాజ్యమా..నీలాంటి అవినీతి పరులను, నీలాంటి నియంతృత్వ శక్తులను సమాజం చాలా మందినే చూసింది.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ముందు ఇలాంటి వారంతా కనుమరుగైపోయారు. రానున్న రోజుల్లో నీ పరిస్థితి కూడా అంతే.శాంతియుతంగా ధర్నాచౌక్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేస్తే.. మీకు కలిగిన ఇబ్బందేంటి?మీ ఫాం హౌజ్ లో ధర్నా చేస్తున్నమా?రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు.. మీ అనుమతి తీసుకుని ధర్నా చేస్తే.. దౌర్జన్యంగా, అక్రమంగా వ్యవహరిస్తారా?మఫ్టిలో ఉన్న పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు.9 ఏండ్లుగా మీరిచ్చిన హామీలను నెరవేర్చమంటే ఉలిక్కిపడుతున్నారు?నీళ్లు, నిధులు, నియమకాలన్నీ ఉద్యమ నినాదమే కదా.1200 మంది బిడ్డలు బాజాప్తా ఉత్తరాలు రాసి.. నేనైతే తెలంగాణ కోసం చనిపోతున్నాను. తెలంగాణ వస్తే.. నా అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెల్లకు ఉద్యోగాలు వస్తాయని ఉత్తరం రాసి అమరులయ్యారు.ఇవాళ ఏం జరుగుతోంది?తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ యువత చనిపోవడంలో అర్థమేముంది.ఏ తెలంగాణ కోసమైతే.. నాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి.. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించుకుంటే.. ఈ 9 ఏండ్లలో.. ఈ కారు కూతలు కూసే.. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ హయాంలో.. మా పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నారు.కుటుంబానికి ఏ రకంగానూ ఆధారంగా ఉండలేకపోతున్నానని.. ఉత్తరాలు రాసి చనిపోయే పరిస్థితి ఎందుకు తలెత్తింది?9 ఏండ్లుగా… ఉపాధ్యాయ నోటిఫికేషన్లు వేయలేని దుర్మార్గ ప్రభుత్వం కేసీఆర్.ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీచేయలేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా.. ఖాళీలే ఉన్నాయి.17 పరీక్షలుపెడితే.. ఆ పరీక్షలన్నీ లీక్ అయ్యాయి.ఇవాళ మోదీ గారి నేతృత్వంలో టైమ్ బౌండ్ పెట్టుకుని.. నెలకు 80 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నాం.ప్రతి నెలా నా చేతులమీదుగా.. 3వేలు 4వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తున్నాను.రైతు కూలీలు, పేదరికంలో ఉన్న పిల్లలు.. ఎలాంటి రికమండేషన్లు లేకుండా.. కేవలం వారి టాలెంట్ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు.గ్రూప్ 1 పరీక్షల కోసం లక్షలమంది నిరుద్యోగ యువత సంవత్సరాల తరబడి వేచిచూస్తున్నారు.అప్పులు చేసి నెలల తరబడి కోచింగ్ తీసుకుంటూ.. చదువుకుంటున్నారు. ఇలాంటప్పుడు పేపర్ లీక్ అయితే.. ఆ కుటుంబాలు ఎట్లా బాధపడతాయో.. నీకు తెల్వదు కేసీఆర్.
నీ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలున్నాయి.. మీ మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి.. కానీ తెలంగాణ నిరుద్యోగుల కుటుంబాల పరిస్థితేంటో ఆలోచించావా? కేసీఆర్.1969లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గం కారణంగా.. 369 మంది.. అమరులయ్యారు.
మలివిడత ఉద్యమంలోనూ.. 1200 మంది అమరులైంది.. ఈ నియామకాల కోసమే కేసీఆర్.రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేశాం.ఢిల్లీలో ఉద్యమాలు చేశాం. కానీ మీ నేతృత్వంలో పోలీసులు వ్యవహరించినట్లుగా ఎక్కడా చూడలేదు.మహిళా కార్యకర్తల పట్ల ఎంత అమర్యాదకరంగా వ్యవహరించారు.సకల జనుల సమ్మెకు రాకుండా..సాగర హారంలోకి రాకుండా పారిపోయిన నీ అయ్యను అడుగు.. కేటీఆర్.. తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు.. 4కోట్ల మంది ప్రజలది.మేమంతా పోరాటం చేశాం.. కోర్టుల చుట్టూ తిరిగాం.మీ సర్టిఫికెట్లు.. మాకు అవసరం లేదు.
ప్రజల ఆశీస్సులు మాతోనే ఉన్నాయి.ప్రతి తెలంగాణ పౌరుడు ఆలోచించాలి.. తెలంగాణ రాకముందు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకున్నది. జై తెలంగాణ అన్నందుకు.. స్కూలు విద్యార్థులను కూడా వదలకుండా కాల్పులు జరిపిన ఘనత కాంగ్రెస్ పార్టీది.చాలా దుర్మార్గంగా వ్యవహరించిన పార్టీ కాంగ్రెస్.తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాగే వ్యవహరిస్తోంది.మనమంతా ఆలోచన చేయాలి.ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. మన నియామకాలు మరిచిపోవాల్సిందే.ఏ చిన్న పొరపాటు చేసినా.. నిజాం అరాచక పాలన అచ్చంగా అమలవుతోంది.
తెలంగాణ సమాజమా మేలుకో..ఈ కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రక్షించుకో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబాలు అత్యంత సన్నిహితమైన కుటుంబాలు.వీరిద్దరూ గతంలో తెలంగాణకు అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు.ఎన్నికల తర్వాత ఫ్రంట్ లో పోతామని కేటీఆర్ బహిరంగంగానే చెప్పారు.ఇంతకన్నా వారిద్దరి దోస్తీకి ఇంకేం కావాలి.కార్యకర్తలు, ప్రజలే నా గురువులు..బీఆర్ఎస్, కాంగ్రెస్ గురువు.. ఒవైసీ.మా పార్టీ పుట్టింది దేశం కోసం. మా పార్టీ పుట్టింది సమాజం కోసం.మీ పార్టీ తెలంగాణ కోసం పుట్టిందన్నావు.. కానీ నేడు ఆ సమాజాన్నే వంచిస్తున్నావు.
మేం అధికారంలోకి రాగానే..ఉద్యోగాల కాలెండర్ విడుదల చేస్తాం.అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం.యూపీఎస్సీ తరహాలో.. మెరుగైన పద్దతుల్లో.. తెలంగాణలో ఉద్యోగాలను పక్కాగా నిర్వహించి.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందజేస్తాం.యువత ఆకాంక్షల అమలులో మనసా, వాచా చిత్తశుద్ధితో పనిచేస్తాం. నిన్న నా పార్టీ కార్యకర్తలు, నా సహచరులు, నిన్న చేసిన పోరాటం వీడియోలు చేస్తుంటే.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.ఇది పోలీసులకు వ్యతిరేకంగా కాదు.. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం.కార్యకర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నాను.