
తాను ఖానాపూర్ బరిలో దిగడం ఖాయమనీ, రెబల్‌గా పోటీ చేసి తీరుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. నిర్మల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఖానాపూర్‌ను తాను ఎంతో అభివృద్ధి చేశాననీ, ఇపుడు కొన్ని పనులకు కొందరు అడ్డుపడుతున్నారన్నారు. ఖానాపూర్ టికెట్ దక్కని రేఖా నాయక్ ఈ పనులు ఆగడానికి కొందరు స్థానిక లీడర్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థఙ జాన్సన్ నాయక్ కూడా కారణమన్నారు. ఆయనకు తీవ్ర స్థాయిలో వార్నింగ్ జారీ చేశారు.
ఏసీబీపీ నిధులు 2.25 కోట్లు రాకుండా ఆపి తనను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని రేఖా నాయక్ అన్నారు. ఖానాపూర్‌లో మున్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా ఎంపిక కావడానికి తానెంతో కృషి చేశానన్నారు. ఇపుడు వాళ్లు మారిపోతే ఇవన్నీ గమనించిన ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు.
తాను అభివృద్ధి పనులు చేస్తే వేరే వాళ్లు గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదన్నారు. కక్షపూరితంగా అభివృద్ధి పనులు ఆపేయడం అన్యాయమన్నారు. పోలీసు అధికారులు తనకు ఉన్న భద్రతను కూడా తగ్గించి వేశారనీ, ఎస్బీ కానిస్టేబుళ్లను ఉపసంహరించడం సరైంది కాదన్నారు. ప్రజలు అమాయకులు కాదనీ, వాళ్లంతా గమనిస్తున్నారన్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారని రేఖా నాయక్ అన్నారు.