
ఐదు దశాబ్దాల ఆ పాట ఒక సమ్మోహక శక్తిగా తెలుగు సమాజాన్ని చుట్టేసి చరిత్రలో భాగమైపోయింది. గద్దర్ భౌతికంగా సెలవు తీసుకున్నాక ఆయన ప్రభావితం చేసిన సమాజం ఆయన జీవించిన కాలాన్ని, ఆ కాలంలో ఆయన ఆచరణను తలపోసుకుంటోంది. గద్దర్ జీవితంలో ఎత్తుపల్లాలు, వెలుగునీడలు ఎలా ఉన్నా ఆయన మూర్తిమత్వం ఎటువంటిదంటే ఆ పేరు తలచినంతనే ఉద్వేగానికి లోనవుతాం. మనందరి భావోద్వేగాల్లో, చైతన్యంలో, ఆరాటపోరాటాల్లో ఆయన విడదీయలేని భాగం. ఆయన దారిమళ్లినప్పుడు, అపస్వరాలు పలికినప్పుడు ఎంత బాధపడినా, ఆగ్రహించినా ఇప్పుడు విద్యుత్ తరంగాల వంటి ఆయన స్మృతులు వెల్లువగా తోసుకురావడం సహజం.
మరణం అనే మానవీయ సందర్భం ఒకటి, మానవ నాగరికతను క్రూరంగా పరిహసిస్తున్న కాలం ఒకటి. ఇటువంటి సన్నివేశంలో గద్దర్ అనే ఒక పర్సనాలిటీని అంచనా వేయడం ఒక సవాలు. అందుకనే అసలు ఆయన్ని అంచనా వేసే తూనికరాళ్లు మనకు లేవని, ఆ పని చేయాలనుకోవడమే ఆయన గొప్పదనాన్ని తగ్గించడమని అంటున్నారు. ఆయన మనకందించిన ఘనమైన సాంస్కృతికోద్యమ వారసత్వాన్ని స్వీకరిద్దాం, లోపాల గురించి చర్చించడం వల్ల ప్రయోజనం ఏమిటి అని కూడా కొందరంటున్నారు.
దేన్నయినా విమర్శనాత్మకంగా చూడాలి అంటే వ్యూహాత్మకంగా దాన్నుండి దూరం పాటించాలి. కొంత నిర్మమమకారంగా కూడా ఉండాలి. గద్దర్ వంటి అసాధారణ వ్యక్తుల విషయంలో ఇది కచ్చితంగా పాటిస్తూ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంత పారవశ్యానికి లోనుచేస్తాడంటే మనం విమర్శను తీసి పక్కన పెట్టి అందులో మునిగిపోతాం. అట్లా సంలీనమైపోతే పరీక్ష చేయలేం. తర్కించలేం.
గద్దర్‌తో కలిసి ఒకే కాలంలో, ఒకే సమాజంలో జీవించి, ఆయన వల్ల ప్రభావితమైన వాళ్లు ఆ నడిచివచ్చిన క్రమాన్ని తలచుకున్నంతనే ఉద్వేగానికి లోనవుతారు. ఆ జ్ఞాపకాలు చెప్పుకుంటూ వస్తారు. అవి మాత్రమే సరిపోవు. ఒక చారిత్రక సందర్భంలో సమాజాన్ని తమ వెంట నడిపించే వ్యక్తులు ఎలా తయారవుతారు? హీరోలైనా, విలన్లయినా ఆకాశం నుండి ఊడిపడరు కదా. సమాజం నుండే ఆ శక్తిని కూడగట్టుకుంటారు. తిరిగి సమాజానికి ఇస్తారు. వారు ప్రభావితం అవుతారు. సమాజాన్ని ప్రభావితం చేస్తారు.
గద్దర్ రూపొందడం వెనక సమాజాన్ని లోలోపలి నుండి కదిలించిన ఉద్యమం ఉంది. అలానే ఆ ఉద్యమాన్ని మూలమూలకూ తీసుకెళ్లి, దాని విస్తరణకు తోడ్పడిన ఆయన కృషి ఉంది. అది జననాట్య మండలి అనే సమష్టిలో భాగంగానే అయినా అందులో వ్యక్తిగా ఆయన ప్రత్యేకత ఉంది. నిజానికి జననాట్య మండలి బృందంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. జననాట్య మండలి రూపొందింది కూడా ప్రజల నుండే.
జనపదాలు, గానం, నాట్యం, ఆహార్యం, అభినయం అన్నీ ప్రజల నుండి తీసుకున్నవే. అందుకనే అవి ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోగలిగాయి. ప్రజల నుండి ప్రజలకు అనే మావో సూత్రాన్ని అద్భుతంగా అమలు చేసింది జననాట్య మండలి. ఊరికే తీసుకొని తిరిగివ్వడం కాదు ఆ క్రమంలో దాన్ని విప్లవీకరించడం అనే ప్రగతిదాయక అంశం ఉంది. దీనికి దోహదం చేసింది విప్లవోద్యమ సిద్ధాంతం, నిర్మాణం.
అది మారుమూల జనాల ఆటపాటలను, అట్టడుగు సమూహాల డప్పు చప్పుళ్లను దేశం నలుమూలలా ప్రతిధ్వనింపజేసి నిజమైన సాహిత్యమంటే ఇది అని సరికొత్త ప్రజాసాహిత్య ఒరవడిని ప్రవేశపెట్టింది. గద్దరే చెప్పినట్లు ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆయన లేడు. జననాట్య మండలి ప్రచురించిన పాటల పుస్తకాల్లో రచయితల పేర్లు లేకుండా ఈ సమష్టి కృషిని తెలియజెప్పే ప్రయత్నం చేసారు.
సమాజాన్ని మార్చబోయే ఆచరణలో తనను తాను మలచుకోవడం, సిద్ధం చేసుకోవడం అనే క్రమం కూడా ఉంటుంది. రచయితగా, కళాకారుడిగా, ఉద్యమకారుడుగా, నాయకుడిగా రూపొందిన గద్దర్ ప్రజల నుండి, విప్లవం నుండి ఏఏ శక్తుల్ని కూడగట్టుకున్నడు, తిరిగివాటిని సమాజానికి ఎలా ఇచ్చాడు అని పరిశీలించాలి. గద్దర్ కవిత్వాన్ని, ఆలాపనను, అభినయాన్ని ఆవైపు నుండి చూడొచ్చు.
ఒక సామూహికత నుండి వచ్చిన గద్దర్ వ్యక్తిగా తన స్వీకరించిన సాంస్కృతికోద్యమ కర్తవ్యాన్ని పరిపూర్తి చేస్తూ, ఆ సమూహ ప్రతినిధిగా నిలిచాడు. ఎంతటివారినైనా నిలదీసే సాహసం ఆయన పాటలో ఉంది. అది ప్రజలకు గొప్ప భరోసానిచ్చింది. ధిక్కార చైతన్యాన్నిచ్చింది. పోలీసులు ఆయన్నే కాదు, ఆయన పాటలను కూడా, అవి పుస్తకాల రూపంలో, క్యాసెట్ల రూపంలో ఉన్నా వెంటాడారు.
అట్లా నలభై ఏళ్ల పాటు సమాజంపై అసాధారణ ప్రభావం వేశాడు. సాహిత్యకారుడిగా కళాకారుడిగానే కాదు, విప్లవోద్యమ ప్రతినిధిగా, తెలంగాణ సమాజ ప్రతినిధిగా జనం ఆయన్ని చూసారు. ప్రజారాజకీయాల్లో ఇదివరకెవరికీ రాని ఒక మాస్ ఇమేజ్ గద్దర్‌కు వచ్చింది. ఆయన మీద హత్యాయత్నం మొత్తం సమాజం మీద దాడిగా తీసుకున్నారు జనం. అయితే సామూహికతలో భాగంగా సమష్టి నిర్మాణంలో భాగంగా ఉన్న దశ నుండి తానే ఒక దృగ్గోచర అంశంగా మారిపోయాడు. విప్లవోద్యమానికి దూరమయ్యాడు.
అంత ప్రభావశీల వ్యక్తి జీవితంలో ప్రభావాన్ని కోల్పోయిన దశ కూడా వచ్చింది. లక్షలాది జనం ముందు గర్జించిన స్వరం ఒక్కడే టివి తెర మీద ఆడుతుంటే పేలవంగా కనిపించాడని ఒప్పుకోక తప్పదు. అంతటి కళాకారుడికి వేదిక లేకపోయింది. దళిత పులుల గర్జన వినిపించిన గద్దర్ బ్రాహ్మణ పురోహితుల ముందు వంగి శఠగోపం పెట్టించుకున్న దృశ్యం ఆయనను ఎంతగానో ప్రేమించిన జనాన్ని బాధించింది.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే బూటకపు ఎన్నికల గుట్టువిప్పిన గద్దరే ఓటు విప్లవం అన్నాడు. ఈ మాటంటే మీ రాజకీయాలతో విభేదిస్తే తిరోగమనం అంటారా అని అడిగే వాళ్లు ఉండొచ్చు. ఆయన భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నా కీలకమైన సందర్భాల్లో ప్రతిస్పందించగలిగీ మౌనంగా ఉండిపోయాడు. ఫాసిజం పెచ్చరిల్లుతుంటే దేశవ్యాప్తంగా కళాకారులు, ప్రజాస్వామిక వాదులెందరో ఎవరి పద్ధతుల్లో వారు నిరసన స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు కదా. అటువంటి ప్రయత్నాన్ని గద్దర్ నుండి ఎవరైనా ఆశిస్తారు.
ఇదివరకు ఎన్నో ఐక్యఉద్యమాలకు కేంద్రంగా ఉన్న మనిషి వెంట నలుగురు కూడలేదు. ఆయన జీవితంలోని ఈ దశను కూడా విశ్లేషించాలి. విప్లవ రాజకీయాలను వదిలి బూర్జువా రాజకీయాలను అంగీకరించడమే ఆదర్శప్రాయం అంటున్నవాళ్లు కూడా ఆయన మరణానంతరం వచ్చి మాట్లాడుతున్నారు కాని అంతకుముందు ఆయన పక్కన లేరు.
ఆయన ఒక్కడే బూర్జువా పార్టీల గడపలు తొక్కుతూ తిరిగాడు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని ఓట్ల విప్లవం అనడం మరో గందరగోళం. నిజానికి ఆయన విప్లవ రాజకీయాలతో ఉన్నప్పుడు పౌరహక్కుల గురించి, రాజ్యాంగాన్ని అమలు చేయడం గురించి చాలా స్పష్టంగా మాట్లాడేవాడు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదని ఆయనకు తెలుసు. కానీ ఓట్లే విప్లవం అనే స్థితికొచ్చాడు.
అయితే గద్దర్ మరణానంతరం ఆయన అసాధారణ వ్యక్తిత్వం మళ్లీ పైకి లేచింది. ఆయన ప్రభావంలో పెరిగిన మనుషులందరూ చివరిచూపుకు పోటెత్తారు. చివరి దశలో గద్దర్ రాజకీయ వైఖరులు ఎలా ఉన్నా జనం మాత్రం తమకు ప్రియమైన ప్రజాయుద్ధ పోరాటరూపాన్ని కడసారి చూసుకోవాలని వెల్లువెత్తారు. అయితే ఆ భావోద్వేగ సందర్భంలోకి రాజ్యం ప్రవేశించింది. అది ఎంత మాత్రం ఆశ్చర్యం కాదు. ఆయన జీవితపు చివరి దశ వారికా అవకాశాన్నిచ్చింది. ఆయన పాపులరైజ్ చేసిన కళారూపాన్ని బూర్జువాపార్టీల దగ్గరి నుండి ఆధ్యాత్మికవాదుల దాకా అనుకరించినట్టు ఆయన మృతదేహం వద్ద ఓట్ల రాజకీయపార్టీలు పోటీలుపడ్డాయి.
ఎంతోమంది అమరుల అంతిమయాత్రలో వేలాది జనం ముందర నడిచిన గద్దర్ అంతిమ యాత్రలో ప్రభుత్వ అధికార లాంఛనాలు ఆయన జీవితంలో దొర్లిన అపశృతిగానే చాలా మంది పోల్చుకున్నారు. అది తెలంగాణ ప్రభుత్వం ఆయనకిచ్చిన, లేదా ఇవ్వాల్సిన గౌరవం అని కొంతమంది అభిప్రాయపడ్డారు కానీ అక్కడ జరిగిన రసాభస, పోలీసు లాఠీచార్జి గద్దర్‌కు సంబంధించిన చివరి విషాదం.
ఆ ఒత్తిడిలో సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ మరణం ఈ మొత్తం విషాదానికి ప్రతీక అయింది. పోలీసు అడ్డగింతల మధ్యనే అమరుల అంతిమయాత్రలను వారి బంధుమిత్రులు, విప్లవాభిమానులు వేలాది మంది కూడి ఎంతో గౌరవంగా నిర్వహించడం మన అనుభవంలో ఉన్నదే. కానీ ఇక్కడ బూర్జువా పార్టీల ప్రచార యావకు, తెలంగాణ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి జహీర్ భాయ్ బలయ్యాడు. విప్లవ సంప్రదాయానికి, బూర్జువా ప్రభుత్వ తీరుకూ ఎంత తేడా.
నెలరోజులుగా కోలాహలంగా జరుగుతున్న గద్దర్ సంస్మరణ సభల్లో చాలామటుకు ఆయన ఎన్నికల రాజకీయాల మార్గంవైపు వచ్చాడు కాబట్టి అదే సరైనది అని ప్రచారం చేస్తున్నాయి. అటువంటి రాజకీయ ప్రయోజనాన్ని కోరేవాళ్లు సహజంగానే గద్దర్ రూపొందిన చరిత్రను పూర్వపక్షం చేసి ఆయనను అతీత మానవుడిగా నిలబెడతారు. అయితే గద్దర్‌ను శిఖరాయమానంగా నిలబెట్టిన రాజకీయాలు, లక్షలాది ప్రజల అభిమానాన్ని సంపాదించిన రాజకీయాలు వాటికి పూర్తిగా భిన్నమైనవి. ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని ఈ వ్యవస్థలో ఎండమావుల వంటి ఎన్నికలు డెబ్భై ఏళ్ల రాజ్యాంగాన్ని ఫాసిస్టుల చేతిలో పెట్టేసాయి.
వాళ్లు జనాన్ని నానాటికీ విచక్షణలేని మూకలుగా మందలుగా మారుస్తున్న స్థితిలో, ప్రజల్ని క్రియాశీలురుగా మార్చే ఉద్యమాల ఆవశ్యకత ఇప్పుడే ఎక్కువగా ఉంది. గద్దర్ విప్లవోద్యమ జీవితమే అందుకు ప్రేరణనిస్తుంది. గద్దర్ అంటే భవిష్యత్ తరాలకు గుర్తుండేది విప్లవ పాటగానే. ఒక చారిత్రక సందర్భంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. అది ఎన్నితరాలకైనా స్ఫూర్తిదాయకం.
పి. వరలక్ష్మి , రచయిత్రి
(అరుణతార సెప్టెంబర్ 2023 సంపాదకీయం)