
బీఎస్పీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ, ఆశా వర్కర్లను పర్మినెంట్ చేస్తాం:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
కనీస వేతనం చెల్లించాలని డిమాండ్
అంగన్వాడి ఉద్యోగులు,ఆశా వర్కర్ల డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, టీచర్లకు రూ.10 లక్షలు,మినీ టీచర్లకురూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి రాకుండానే నెలకు రూ.3,36,000 జీతం తీసుకుంటున్నారు,కానీ అంగన్వాడీ,ఆశా వర్కర్లకు మాత్రం కనీస వేతనం చెల్లించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం సూచించే అన్ని పనులు చేపడుతున్నా,వీరికి న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లను కేసీఆర్ పరిష్కరించని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.