
సీపీయస్ రద్దు చేసిన రాష్ట్రాలకు వారి పెన్షన్ నిధి ఇవ్వక పోవడం అమలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: ఎన్.ఎంఓపియెస్ సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ.
నేడు దేశ రాజధాని న్యూ ఢిల్లీ నడి బొడ్డున రాం లీల మైదానంలో నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ గారి నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది.
దీనికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో సీపీయస్ విధానంలో ఉన్న ఉద్యోగ,ఉపాధ్యాయులు హాజరైయ్యారు. ఈ సభ కు ఉత్తరప్రదేశ్ అధ్యక్షులు విజయ్ కుమార్, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు సుఖ్జీత్ సింగ్, తెలంగాణ రాష్ట్రం నుండి సీపీయస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,కోశాధికారి నరేష్ గౌడ్,మహారాష్ట్ర నుండి విటేష్ కండెల్కర్,హర్యానా దారివాల్, హిమాచల్ ప్రదేశ్ ప్రదీప్ ఠాకూర్,కర్ణాటక నుండి శాంతారం మరియు కేంద్ర,రాష్ట్ర, ఆర్డినెన్స్ ,రైల్వే, ఆటోనోమాస్ ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఈ సభకు ముఖ్య అతిథిగా కిసాన్ సంఘ నేత రాకేష్ టి కాయత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానం అనేది ఇటు ఉద్యోగ ఉపాధ్యాయులకు, రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు కాకుండా కేవలం కార్పొరేట్ల సొమ్ము నింపడానికి ఈ విధానం ఉందని ,ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సొమ్ము 9 లక్షల కోట్లు షేర్ మార్కెట్ లో ఉందన్నారు. ఇటీవల సీపీయస్ వల్ల పదవీ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులు అధికారులు కేవలం నెలకు 1200, 1800 పెన్షన్లు పొందుతున్నారన్నారు. వారికి దీనితో జీవనోపాధి లేక తమ సామాజిక భద్రతను కోల్పోతున్నారు. ఇటీవల దేశాన్ని రక్షించడానికి అత్యున్నత త్యాగం చేసిన పారా మిలిటరీ బలగాలకు కూడా పాత పెన్షన్ విధానాన్ని నిరాకరించడం అనేది చాలా దుర్భరనీయం అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యంలో ఉన్న ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం గురించి ఆలోచిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం 30- 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగులకు మాత్రం తన బాధ్యత నుంచి తప్పించుకుని దానిని ఉద్యోగులపై నెట్టివేసి వారి భద్రతను అనిశ్చితితో కూడిన షేర్ మార్కెట్ లోనికి నెట్టి వేయడం జరిగిందన్నారు.
2003లో భారతదేశం జిడిపిలో 12వ స్థానం,అది నేడు 20 సంవత్సరాల తర్వాత అంటే ప్రపంచంలో ఇండియా జిడిపిలో ఐదవ స్థానంలో కొనసాగుతుందని, 2003-04 భారతదేశము యొక్క బడ్జెట్ పరిమాణం 4.4 లక్షల కోట్లు కానీ నేడు అది 2023 24 లో 45 లక్షల కోట్లకు చేరిందని, ఇంతటి బడ్జెట్లో ఉద్యోగుల పాత్ర చాలా గొప్ప దని అన్నారు.ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 9.87 లక్షల కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఇది ఉద్యోగి నిస్వార్థ సేవ వల్లే ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు.
ఇటీవల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసినటువంటి రాజస్థాన్, చతిస్గడ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల కంట్రిబ్యూషన్ మరియు ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ దాదాపు 2004 నుండి రాజస్థాన్ 39 వేల కోట్లు ,చత్తీస్గడ్ 18 వేల కోట్లు, జార్ఖండ్ 12 వేల కోట్లు హిమాచల్ ప్రదేశ్ 9వేల కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక శాఖ ,కేంద్ర ప్రభుత్వం మరియు పిఎఫ్ ఆర్డీఏ ప్రత్యేక చొరవ తీసుకొని వారి సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రం అయితే పిఎఫ్ ఆర్ డి ఏ నుండి ఎగ్జిట్ అవ్వాలనుకుంటుందో వాటికి ఆ అవకాశాన్ని ఇచ్చి రాష్ట్రాలను స్వేచ్ఛను కాపాడుతూ సమఖ్యా స్ఫూర్తిని కొనసాగించాలని, అంతేగాని సమైక్యస్ఫూర్తిగా విఘాతం కలిగించద్దని డిమాండ్ చేశారు.
సభ కు ముఖ్య అతిథిగా హాజరైన కిసాన్ సంఘ్ అధినేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ రైతు బిడ్డలుగా ఉన్న ఉద్యోగులు చేస్తున్న నేటి ఈ పెన్షన్ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ విధానం పట్ల ఉద్యోగులు పడుతున్న బాదలు గురించి వివరిస్తానన్నారు.సభలో ఉద్యోగ ఉపాధ్యాయుల చేత సిపిఎస్ రద్దు చేయని రాష్ట్రాల్లో ఓట్ ఫర్ ఓపిఎస్ కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.రామ్ లీల మైదానం లో అధిక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయుల పురాని పెన్షన్ నినాదాలతో హోరెత్తింది.