
కొన్ని సంఘటనలు విన్నా, చూసినా అవి మనసు మీద వేసే ముద్ర మధురంగా ఉంటుంది. అది చిన్న సంఘటనే అయినా ఇచ్చే స్ఫూర్తి మటుకు కొండంత. అందులోనూ అది అనుబంధాల తీపిగుర్తు అయితే ఇంక చెప్పేదేముంది? ఆ తీయదనం తాకని హృదయం ఉంటుందా… అలాంటి సంఘటనకు అద్దం పట్టేదే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫ్యామిలీ ఫోటో. ఈ ఛాయాచిత్రం వెనుక దాగున్న కథ తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే చిక్కటి వాత్సల్యం, ప్రేమానుబంధాలను పట్టిస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు యువతుల పేర్లు మహి, ప్రియాంకలు. వీరిద్దరికీ తమ తండ్రి పనిచేసే చోటు చూడాలన్నది చిరకాల వాంఛ. తన ఇద్దరు కూతుళ్ల ఈ చిరు కోరిక ఆ తండ్రి గుండెను తాకింది. అంతే ‘పదండి వెళదాం’ అంటూ తను పనిచేసే చోటుకి వాళ్లను తీసుకెళ్లారాయన. ఆయన పనిచేస్తున్నది సుప్రీంకోర్టులో. దేశ అత్యున్నత న్యాయస్థానంలో తమ నాన్న పనిచేసే చోటు చూసిన ఆ ఇద్దరు కూతుళ్ల ఆనందానికి హద్దులు లేవు. వారి సంతోషానికి ఆకాశమే హద్దు అనిపిస్తుంది ఆ అమ్మాయిలను చూసిన వారికి. ఇంతకూ ఆ ఇద్దరు అమ్మాయిల తండ్రి ఎవరో తెలుసా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. వారి తల్లి కల్పనా చంద్రచూడ్. తల్లిదండ్రులకు చెరోవైపున వీల్ ఛైర్లలో కూర్చున్న వాళ్లే వారి బిడ్డలు మహి, ప్రియాంకలు. సుప్రీంకోర్టు ప్రాంగణానికి తల్లిదండ్రులతో కలిసి వీళ్లు కలసివచ్చినపుడు తీసిన ఫోటో ఇది. మహి, ప్రియాంకలు ఇద్దరూ డిఫరెంట్లీ ఎబుల్డ్. వీల్ ఛెయిర్ లో తప్ప వీళ్లు నడవలేరు. వీరిద్దరినీ చంద్రచూడ్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఈ దంపతుల గొప్పదనానికి, విశాల హృదయానికి ఇంకా మాటలు అవసరమా… అందరూ ఉదాత్తమైన అభిప్రాయాలను, ఆదర్శాలను చెప్తుంటాం. కానీ మాటలు కాకుండా చేతల్లో చూబించే వారు అరుదుగా ఉంటారు. అలాంటి వారు మన దేశ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ దంపతులు. వారి ఈ ఫ్యామిలీ ఫోటో వెనుక ఇంత స్ఫూర్తిని పంచే నిజం దాగుంది. ఇది మరెందరిని ఇన్ స్పైర్ చేస్తుందని వేరే చెప్పాలా?I