
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాణలో ఇపుడు మారుమోగుతున్నపాట, పండగ. కోలాటాలు, గ్రూపు డ్యాన్సులతో అలరారుతున్న ఫెస్టివల్. బతుకమ్మ చుట్టూ మహిళలంతా గుమిగూడి లయబద్దమైన స్టెప్పులతో ఆడుకునే ఈ ఆటకు ఉన్న ప్రత్యేక ఏమిటో తెలుసా. తొమ్మిది రోజులు లేదా నవ రాత్రులు ఎందుకింత వేడుకగా, పండుగగా, శ్రద్ధగా బతుకమ్మ జరుపుకుంటారు? అందులోకి ప్రత్యేకత ఏమిటీ? దుర్గా నవరాత్రులకూ, బతుకమ్మకు ఉన్న పోలిక ఏమిటీ?.. ఒక్కసారి ఈ ఆర్టికల్ చూడండి. తెలిసిపోతుంది..

బతుకమ్మ పూల పండగ. తెలంగాణాలో ప్రతి ఇంటా జరుపుకునే సాంస్కృతిక వేడుక. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు పెద్దా, పిన్నా అందరూ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. గౌరీ దేవిని బతుకమ్మ రూపంలో తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. బతుకమ్మలను తయారుచేయడంలో మగవాళ్లు సైతం ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. భాద్రపద అమావాస్యకు రెండు రోజుల ముందు బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. దుర్గాష్టమి తర్వాత రెండవ రోజు, అంటే ఆశ్వయుజ దశమి నాడు దసరా జరుపుకుంటారు. అదే విజయదశమి. ఈ పూలపండుగ అమావాస్య క్యాలెండర్ ప్రకారం భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమవుతుది.ఈ రోజును తెలంగాణాలో పెతర అమాస లేదా పితృ అమావాస్య అని కూడా అంటారు. ఇది శరత్ రుతు ప్రారంభాన్ని సూచిస్తుంది.

కుటుంబంలోని ఆడవాళ్లందరూ రకరకాల పూలతో బతుకమ్మను నిండుగా తయారుచేస్తారు. అందుకోసం పూల సేకరించేందుకు ఇంట్లో మగపిల్లలు, ఆడపిల్లలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అందరూ ఉదయమే లేచి పూలను పోటీపడి తెస్తారు. కుటుంబంలోని మహిళలు, యువతులు అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ పూల బతుకమ్మను చేస్తారు. అంతేకాదు తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగను మహిళలు, పిల్లలు ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు. సాయంత్రం అవగానే సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ ఆడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. కోలాటమాడతారు. నృత్యాలు చేస్తారు.

ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. అక్టోబర్ 22 కి ఇవి ముగుస్తాయి. ఈ పండుగ భాద్రపద అమావాస్య నాడు చిన్న బతుకమ్మతో మొదలై ఆశ్వయుజ అష్టమిన పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. దీనిని దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు చేసే బతుకమ్మ పండుగను రోజుకొక పేరుతో పిలుస్తారు. తొమ్మిది రోజుల పాటప్రతి రోజూ అమ్మవారికి ఒక్కొక్క రకం ప్రసాదం నైవైద్యం పెడతారు.

day 1–ఎంగిలి పూల బతుకమ్మ
బతుకమ్మ మొదటి రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజున తమ పూర్వీకులకు ఆహార నైవేద్యాలతో నివాళులర్పించి ఆతర్వాత బతుకమ్మను తయారుచేస్తారు. మొదటి రోజు బతుకమ్మకు బియ్యం, నువ్వులు నైవేద్యాలుగా పెడతారు.
day 2–అటుకుల బతుకమ్మ
బతుకమ్మ రెండవ రోజును అటుకుల బతుకమ్మ అంటారు. ఆ రోజు అమ్మవారికి అటుకులు, బెల్లంను నైవేద్యంగా పెడతారు.
day 3– ముద్దపువ్వు బతుకమ్మ
మూడవ రోజు పూజించే బతుకమ్మను ముద్దపువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఎందుకంటే ఆ రోజున బతుకమ్మను ముద్దచామంతి లేదా ముద్దబంతి పువ్వులతో, తంగేడు, గుణుగు పువ్వలతో తయారుచేస్తారు. ఆ రోజు బతుకమ్మకు ముద్దపప్పు ,అన్నం నైవేద్యంగా పెడతారు.

day 4– నాన బియ్యం బతుకమ్మ
నాలుగవ రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. ఆ రోజు అమ్మవారికి నానబెట్టిన బియ్యం, బెల్లంను నైవేద్యాలుగా పెడతారు.
day 5– అట్ల బతుకమ్మ
ఐదవ రోజు నాటి బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. ఆ రోజు బతుకమ్మకు ఆడవాళ్లు అట్లు (దోసె లేదా రొట్టె) నైవేద్యంగా పెడతారు.
day 6– అలక బతుకమ్మ
ఆశ్వయుజ పంచమి నాడు అంటే ఆరవ రోజున నైవేద్యం ఉండదు. ఆ రోజు గౌరీదేవి బాధపడిందని భక్తులు నమ్ముతారు. అందుకే ఆనాడు గౌరమ్మను అలక బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజును లలిత పంచమిగా కూడా భక్తులు జరుపుకుంటారు.

day 7– వేపకాయ బతుకమ్మ
ఆశ్వయుజ షష్టి నాడు దుర్గాష్ఠమి జరుపుకుంటారు. గౌరమ్మకు వేపకాయ ఆకారంలో నైవేద్యం పెడతారు. అందుకే ఆ రోజు అమ్మవారిని వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజు బతుకమ్మకు వేప పండ్ల ఆకారంలో సక్కినాల పిండిని నైవేద్యం చేస్తారు.
day 8– వెన్న ముద్దల బతుకమ్మ
ఆశ్వయుజ సప్తమి నాడు అంటే ఎనిమిదవ రోజు బతుకమ్మను వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. మహిళలు ఆ రోజున బతుకమ్మకు వెన్నముద్దలను నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా నువ్వులు, బెల్లం, నెయ్యి, నువ్వుల లడ్డులు పెడతారు. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు.

day 9– సద్దుల బతుకమ్మ
ఆశ్వయుజ అష్టమి (దుర్గాష్టమి) రోజు జరుపుకునే బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటారు. ఆ రోజున బతుకమ్మను ఎనిమిది రోజుల కంటే పెద్దదిగా ఉండేలా రకరకాల పూలతో ఒకరితో ఒకరు పోటీపడి మరీ మహిళలు పెద్ద బతుకమ్మను చేస్తారు.

బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ. బతుకమ్మకు అలంకరించే పూలన్నీ ఎన్నో ఔషధగుణాలు ఉన్నవి. చామంతి, బంతి, తంగేడు, గునుక ఇలా రకరకాల రంగు రంగు పూలతో బతుకమ్మను తయారుచేసి ఆటపాటలతో ఎంతో వేడుకగా చేసుకునే ఈ పూల పండుగ సామూహికంగా కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ. తెలంగాణా సంస్కృతిని, తెలంగాణా మూలాలను అద్దంపట్టే పండుగ. ఈ పూలపండుగలో పర్యావరణ పరిరక్షణా సందేశంతో పాటు రైతులకు భూమితో, పచ్చదనంతో, పంటలతో, పర్యావరణంతో ఉన్న సంబంధం, చైతన్యం ప్రతిఫలిస్తుంటుంది. ఈ పూల పండుగలో మహిళల ఆనందం అంబరమంటుతుంది. వారి ఆటపాటలు తెలంగాణా ప్రతి పల్లెలో, వీధి వీధిన ప్రతిధ్వనిస్తుంటాయంటే అతిశయోక్తి కాదు. పచ్చని బతుకమ్మ తిరిగి రా అంటూ మహిళలందరూ గొంతెత్తి గానం చేసే తీయటి పాటల్లో జాలువారే ప్రకృతి చైతన్యం మనసులను పులకరింపచేస్తుంది. చివరి రోజున బతుకమ్మను నీటిలో వదిలి గౌరమ్మకు భక్తితో మొక్కుతారు.
