
భారతదేశంలోని అంతర్జాతీయ ట్రావలర్స్ కు శుభవార్త. ఇకపై వీసాతో పనిలేకుండా కేవలం పాస్ పోర్టుతోనే 57 దేశాలను మనవాళ్లు చుట్టిరావచ్చు. అయితే కొన్ని నిర్దిష్ట పత్రాలను మాత్రం తప్పనిసరిగా చూబించాల్సి ఉంటుంది. ఇంతకూ వీసా-ఫ్రీ ట్రావల్ అంటే ఏమిటనే సందేహం వచ్చే ఉంటుంది. వీసాతో పనిలేకుండా, అందుకోసం దరఖాస్తు చేసుకోనవసరం లేకుండానే దేశ జాబితాలో పేర్కొన్న పలు విదేశాలకు భారతీయులు వెళ్లొచ్చు. అయితే వీసా– ఫ్రీ దేశాలలోకి ప్రవేశం సులభమేనా …లేదా ఆ యా దేశాల్లోకి ప్రవేశించకుండా పర్యాటకులను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయా అనే సందేహాలు మనల్ని చుట్టుముడుతుంటాయి.

కొన్ని డాక్యుమెంట్ పత్రాలను తప్పనిసరిగా అక్కడి అధికారులకు చూపించాల్సి ఉంటుంది . వాటిల్లో గడువుదాటని పాస్ పోర్టుతో పాటు రాను, పోను ప్రయాణ టికెట్లు, ట్రావల్ బీమా వంటివి ఉన్నాయి. అలాగే ఆయా దేశాలలో పర్యాటకులు బస చేసే వసతి వివరాలు, వాక్సినేషన్ సర్టిఫికేట్లు, పాస్ పోర్టు సైజు ఫోటోలు, కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్, మూడు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్ వివరాలు, ప్రయాణీకులకు మందుల వినియోగం ఉంటే వాటికి సంబంధించి పర్సనల్ వైద్యుడు రాసిన ప్రిస్క్రిప్షన్లు వంటివాటిని కూడా పర్యాటకులు తమ దగ్గర పెట్టుకోవాలి. వీటితోపాటు తగినంత విదేశీమారకద్రవ్యం కూడా దగ్గర ఉంచుకోవాలి. మీరు వెళ్లిన దేశంలోకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రవేశించాలంటే ఆయా దేశాల ఇమ్మిగ్రేషన్ అధికారులు కోరిన పత్రాలను వారికి తప్పనిసరిగా చూబించాలి. అలాగే ఏవైనా నిషేధిత వస్తువులు మీదగ్గర ఉన్నా, మీది అనుమానాప్పద ప్రవర్తనగా ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనిపించినా ఆ దేశంలోకి మీ ప్రవేశాన్ని అడ్డుకోవచ్చు.

ఇకపోతే వీసా-ఫ్రీ ట్రావల్ ఉన్న దేశాలలో ఎన్నిరోజులు ఉండొచ్చనేది మరో సందేహం. ఆయా దేశాలు అంతర్జాతీయ ప్రయాణీకులకు నిర్దేశించిన నియమనిబంధనలకు అనుగుణంగా ఒక వారం నుంచి ఆరు నెలల దాకా పర్యాటకులు ఆ దేశంలో ఉండొచ్చు. అయితే టూరిస్టు విజిట్లకు, పరిమిత రోజుల విడిదికి (షార్ట్ స్టేస్) మాత్రమే వీసా-ఫ్రీ ట్రావల్ సౌకర్యం వర్తిస్తుంది. వీసా-ఆన్ అరైవల్ కి, వీసా-ఫ్రీ ట్రావల్ కి తేడా ఉంది. వీసా-ఫ్రీ ట్రావల్ కు గడువుదాటని పాస్ పోర్టుతో పాటు నిర్దిష్టమైన పత్రాలు చూబించాల్సి ఉంటుంది. విజిటర్ దేశంలోకి ప్రవేశించినపుడు వీసా-ఆన్ అరైవల్ ను జారీచేస్తారు. ఈ కేటగిరీ ప్రయాణీకులు వీసా కోసం ముందొస్తుగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు.

భారత పాస్పోర్టుదారులు వీసాతో పనిలేకుండా మాల్దీవులు, మారిషస్, గ్రెనడినెస్, సెనగల్, కజికిస్తాన్, ఫిజి, భూటాన్, కతార్ మొదలైన 57 దేశాలను సందర్శించవచ్చు. అయితే ఇలా పలు దేశాలలో పర్యటించాలనుకునే వారు తప్పనిసరిగా ట్రావల్ బీమా చేయించుకోవాలి. హెల్త్ కేర్ ఎమర్జన్సీలప్పుడు, బ్యాగేజి పోగొట్టుకున్నప్పుడు, ఫ్లైట్ రద్దు లేదా ఆలస్యం అయినా, ఎక్కువ రోజులు ఏదైనా దేశంలో ఉండాల్సి వచ్చినా అవన్నీ కూడా ట్రావల్ ఇన్స్యూరెన్స్ కింద కవర్ అవుతాయి. ఇటీవల హెన్లే పాస్ పోర్టు ఇండెక్స్ ప్రచురించిన తాజా వివరాల ప్రకారం బలమైన పాస్ పోర్టు అవకాశాలు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడు అంకెలకు ఎగబాకి 80వ స్థానంలో నిలిచింది కూడా.