
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి వినే ఉంటారు. బరువు తగ్గే రెజీమ్ లో బుల్లెట్ కాఫీ తప్పకుండా ఉంటుంది. అయితే బరువు తగ్గించంలో ఇది నిజంగా సూపర్ డ్రింకా? దీని వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు కూడా లేకపోలేదు. బరువు తగ్గడంలో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మంచి ఛాయిస్ అనేవారు ఉన్నారు. కాఫీ బరువు తగ్గిస్తుంది కానీ దాన్ని తయారు చేసుకునే తీరును బట్టి అది ఆధారపడి ఉంటుందని కొందరు పోషకాహారనిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు బ్లాక్ కాఫీలో బరువును తగ్గించే గుణాలు ఎన్నో ఉన్నాయి. బ్లాక్ కాఫీ తర్వాత బరువు తగ్గాలనుకునేవాళ్లు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడమనే ట్రెండు ఒకటి ప్రపంచమంతా ఊపందుకుంది. బరువు తగ్గించడంలో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బాగా పనిచేస్తుందని కొందరు ఊబకాయ నిపుణులు సైతం అంటున్నారు . మనిషి మెటబాలిక్ యాక్టివిటీని పెంచుతుందని చెప్తున్నారు. కాలరీలను కరిగిస్తుందని కూడా తేల్చారు. అంతేకాదు శరీరంలోని అదనపు నీటిని సైతం ఇది తగ్గిస్తుందని అంటున్నారు. అలా అని బరువు తగ్గుతామని కాఫీ పరిమితికి మించి తాగితే మంచిది కాదని కూడా చెప్తున్నారు. కాఫీలో చక్కెర కలుపుకుని తాగితే ప్రయోజనం అస్సలే ఉండదని కూడా తేల్చారు. అలా తాగితే బరువు తగ్గడం మాట అటుంచితే దానివల్ల బరువు పెరుగుతామని చెప్తున్నారు. దాంతోపాటు శరీరంలో కాలరీలు కూడా ఎక్కువవుతాయి.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీకి బరువు తగ్గించే సూపర్ డ్రింకుగా పేరుంది. ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయమూ ఉంది. ఇది ఒక ట్రెండీ కన్కాక్షన్ అని నిపుణులు చెప్తున్నారు. మీ మార్నింగ్ రొటీన్ ని రీఛార్జ్ చేసేలా డిజైన్ చేసిన డ్రింకు ఇదని అంటున్నారు. దేవ్ యాస్ప్రే అనే పారిశ్రామికవేత్త బ్రెయిన్ ఛైల్డ్ ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. ఇది మూడు రకాల పదార్థాల మిశ్రమం. నాణ్యమైన కాఫీ, బటర్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ ఆయిల్ మూడింటి సమ్మేళనం ఇది. శరీరానికి కావలసిన శక్తి ఇవ్వడంతో పాటు శరీర బరువు తగ్గిస్తుంది ఈ సూపర్ డ్రింకు. ఈ డ్రింకు తయారుచేసుకునే టప్పుడు కొందరు బటర్ బదులు కొబ్బరినూనె లేదా నెయ్యి వంటి ప్రత్యామ్నాయ హెల్దీ ఫ్యాట్స్ అందులో కలిపి తీసుకుంటుంటారు. వారి ఛాయిస్ ఫ్యాట్స్ తో చేసుకునే ఈ రకమైన వారి సొంత బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కూడా పైన చెప్పిన రీతిలో తయారుచేసిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఇచ్చే ఫలితాలనే ఇస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చేసే పని విషయానికి వస్తే, ఇది శరీరానికి బాగా ఎనర్జీనిస్తుంది. మీ డైటరీ ప్లాన్ ను సరిగా అనుసరించేట్టు సహాయపడుతుంది. ఆకలి లేకుండా చేస్తుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఎనర్జీకి కావలసిన ఫ్యాట్లను శరీరంలో స్టోర్ చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది సమతులా హారానికి సప్లిమెంట్ లాంటిది మాత్రమే తప్ప అద్భుతాలు చేసే పరిష్కారం కాదు. ఇది బరువును తగ్గించడంతో పాటు ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. క్రేవింగ్ లేకుండా చేస్తుంది. వారానికి ఒకసారి బ్రేక్ ఫాస్ట్ కు బదులు మీల్స్ రిప్లేస్మెంట్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వర్కవుట్ల ముందు తాగే మంచి డ్రింకు కూడా. దీన్ని తాగడం వల్ల బలం పెరిగి కాలరీలు బాగా కరిగేలా వ్యాయామాలు చేయగలరు. ఎ, డి, ఇ వంటి విటమిన్లను కూడా పరిమిత స్థాయిలో ఈ బుల్లెట్ ప్రూఫ్ డ్రింకులో ఉంటాయి. అలాగే దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులు కూడా లేకపోలేదు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో కాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలరీలు హెల్దీ ఫ్యాట్స్ నుంచి పొందుతాం. డైలీ మీరు తీసుకునే కాలరీ ఇన్ టేక్ లో ఇవీ చేరతాయి. అలాగే మీరు కనుక హై ఫ్యాట్ డైట్ తీసుకుంటుంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడం వల్ల శరీరంలో ఫ్యాట్స్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో ఫ్యాట్స్ ఉండాల్సిన దానికన్నా బాడీలో ఎక్కువగా చేరే అవకాశం ఉంది. ఈ ఫ్యాట్స్ ను సరిగా క్రమబద్ధీకరించకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లో ఎక్కువ ఫ్యాట్లు, కెఫైన్ ఉంటుంది. సంపూర్ణ ఆహారంలో ఉండే అత్యవసర పోషకాలు ఇందులో ఉండవు. అందుకే ఈ డ్రింకు సమతులాహారం సప్లిమెంటుగా ఉండాలే తప్ప మీల్స్ ని మిస్ చేసేదిగా ఉండొద్దంటున్నారు పోషకాహారనిపుణులు.