
ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరూ ట్రాన్స్ జండర్ వైద్యులు. వారి పేర్లు డాక్టర్ ప్రాచీ, డాక్టర్ రూత్ జాన్ పాల్. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో తొలి ట్రాన్స్ జండర్ వైద్యులుగా వీళ్లు రికార్డు సృష్టించారు. ఎందరో ట్రాన్స్ జండర్లకు మల్లేనే సమాజం నుంచి వీళ్లు కూడా ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, అసమానతలను ఎదుర్కొన్నారు. తీవ్ర వివక్షనూ చవిచూశారు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇతర వైద్యులకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రజలకు వైద్యసేవలను అందిస్తూ ఎందరి నుంచో ప్రశంసలను అందుకుంటున్నారు. మొత్తం ఎల్జిబిటిక్యూ కమ్యూనిటికీ గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. వారేమంటున్నారంటే..
నాన్న పుణ్యమే ఇది : డాక్టర్ ప్రాచీ

ఈ రోజు వరకూ ట్రాన్స్ జండర్ గా నా జీవితం బాధగానే నడిచింది. నేను ట్రాన్స్ జండర్ అని తెలిసిన నాటి నుంచి ఈ రోజు వరకూ నా కుటుంబం నాతో టచ్ లోనే లేదు. వారు నన్ను కలవడం మాట అటుంచితే కనీసం ఎలా ఉన్నావని ఫోను చేసి అయినా అడగరు. ఒక్కమాటలో చెప్పాలంటే నా ఫ్యామిలీ నన్ను పూర్తిగా వదిలేసింది. మా ఊరు ఆదిలాబాద్. మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్నకు నన్ను బాగా చదివించి డాక్టర్ చేయాలనే కోరిక ఉండేది. నాన్న కోరిక తీరుద్దామని నేను ఎంతో కష్టపడి చదివా. ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు కూడా తెచ్చుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదివి డాక్టరయ్యాను. నేను ఐదవతరగతి చదివినపుడు నేను అబ్బాయి అయినా నాలో ఆ లక్షణాలు లేవనిపించింది. ఎక్కువ సమయం ఆడవాళ్లతో తిరుగుతూ వారితోనే ఆడుకునేవాడిని. వారితో గడిపేటప్పుడు మనసుకు ఎంతో హాయిగా, ప్రశాంతంగా అనిపించేది. నాతోటి అబ్బాయిలతో నాకు సరిగా స్నేహమే ఉండేది కాదు. నాలోని తేడా నలుగురిలో నన్ను తీవ్ర వివక్షకు గురిచేసేది. నేను తీవ్ర మానసిక హింసకు లోనయ్యేవాడిని. కాలేజీలో చేరిన తర్వాత ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దానికి తోడు నా ప్రవర్తన కూడా అమ్మాయిలా ఉండడంతో అందరూ నన్ను ఏడిపించేవారు. అవమానించేవారు. హేళన చేసేవారు. పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేవారు. ఒక దశలో ఈ హింస భరించలేక చచ్చిపోవాలని అనుకున్నా కూడా. కానీ వాటన్నింటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగా. నా సెక్స్యువల్ ఐడెంటిటీ విషయాన్ని ఎవ్వరి దగ్గర దాచకూడదనుకున్నా. ధైర్యంగా నేనేమిటో అందరికీ ప్రకటించాలని నిర్ణయించు కున్నాను. ఎంబిబిఎస్ చేసేటప్పుడు నేను ట్రాన్స్ జండర్ని అనే విషయాన్ని బహిరంగంగా చెప్పడం మొదలెట్టా. ఆ విషయం తెలిసినప్పుడు కొందరు నాతో మాట్లాడడం మానేశారు. కొందరు నాకు పూర్తిగా దూమయ్యారు. ఇంకొందరు ఎప్పటిలా నాతో స్నేహంగానే మసలుకునేవారు. అయితే నన్ను హేళనచేసే వారు, వెక్కిరించేవారు కూడా ఎక్కువయ్యారు. ఇలంటి ఎన్ని అవమానాలు ఎదురైనా నాలోని ఆత్మవిశ్వాసాన్ని చెరగనివ్వ లేదు. నా చదువును ఆపలేదు. డాక్టర్ కావాలన్న నా లక్ష్యాన్ని మధ్యలో వదిలేయలేదు. అనుక్షణం నాకు నేనే నాలో స్ఫూర్తి నింపుకున్నాను. నన్ను నేను నిత్యం మోటివేట్ చేసుకోవడం ప్రారంభించాను. ఏ ఒక్కరూ మా పరిస్థితిని అర్థంచేసుకోలేరు. అందుకే ట్రాన్స్ జండర్లకు మల్లే నేను కూడా ఎంతగానో హింసలపాలయ్యాను. నా జీవితంలో ఎంతో నరకం చూశాను. నాన్న వల్లే నేను డాక్టరునయి ఈ రోజు ఇలా ధైర్యంగా నిలబడ్డాను. మమ్మల్ని ఎవ్వరూ అర్థంచేసుకోలేరు. గుండెలతో ఆదరించలేరు. ఇది చేదు వాస్తవం.కానీ సమాజంలో మార్పు వస్తుందనే ఆశే మమ్మల్ని మరింత ముందుకు వెళ్లేలా చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. అలాగే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా అన్నింటిలో ట్రాన్స్ జండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలైనపుడే, అందరితోపాటు సమానంగా అన్ని రకాల హక్కులూ, జీవిత భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం వంటివి పొందిననాడే ట్రాన్స్ జండర్లందరూ విజేతలుగా నిలుస్తారు. అప్పుడే ట్రాన్సజండర్లు కూడా అందరికి మల్లే సమానహక్కులను అనుభవించగలుగుతారు. అప్పుడే అందరూ వారిని తోటి మనుషులుగా చూడగలుగుతారని నా అభిప్రాయం.
అదే నన్ను డాక్టరును చేసింది: డాక్టర్ రూత్ జాన్ పాల్

‘మాది ఖమ్మం. అక్కడ పన్నెడవ తరగతి వరకూ చదివా. నాన్న మా చిన్నప్పుడే చనిపోవడంతో ఇంటికి పెద్ద అండ లేకుండా పోయింది. దీంతో మేం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. నాకు ఏడేండ్ల వయసప్పుడు నేను అందరి అబ్బాయిల్లాంటి వాడిని కాదనిపించింది. శారీరకంగా నాలో ఏదో తేడా ఉందనిపించేది. కానీ ఎవ్వరితోనూ ఆ విషయం చెప్పుకునే ధైర్యం ఉండేది కాదు. నాతోటి అబ్బాయిలతో గడిపేవాడిని కాదు. ఎప్పుడూ అమ్మాయిలతో ఆడుకోవడం, వారితో గడపడం అంటే బాగా ఇష్టంగా ఉండేది. వాళ్లల్లా రంగు రంగుల దుస్తులు ధరించి అందంగా కనిపించాలని మనసు ఉవ్విళ్లూరేది. నేను ఎక్కువ సేపు ఆడపిల్లలతో గడపడం చూసిన నా మిత్రులు నన్ను వెక్కిరించేవారు. ఇంట్లో కూడా ఎప్పుడూ అమ్మ వెంటే తిరుగుతూ అమ్మకి ఇంటిపనుల్లో సహాయం చేసేవాడిని. అందుకే అమ్మతో నాకు ఎంత అనుబంధం ఉండేదో మా అమ్మకు కూడా నేనంటే అంత ఇష్టంఉండేది. కానీ నాలోని శారీరక మార్పులను అమ్మతో సహా ఎవ్వరితో చెప్పే సాహసం చేయలేదు. ఈ విషయమై మానసికంగా నాలో ఎంతో ఒత్తిడి ఉన్నా చదువును మాత్రం ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. నాకు డాక్టరవాలనే ఆలోచన రావడం వెనుక కూడా ఒక సంఘటన ఉంది. నేను ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక రూములో కొందరు ట్రాన్స్ జండర్లు కలిసి ఉండేవారు. వారిలో ఒకరు అనారోగ్య సమస్యతో చనిపోవడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ట్రాన్స్ జండర్ కావడం వల్ల ఆసుపత్రిలో చేర్చుకోలేదు. తగిన వైద్యసేవలు అందించలేదు. ఎంత దురదృష్టకర పరిస్థితి అంటే ఆ ట్రాన్స్ జండర్ చనిపోయినా కూడా ఎవ్వరు పట్టుంచుకున్న దిక్కు లేదు. ఈ సంఘటన విన్నప్పుడు ఎందుకో నాలో తీవ్ర అలజడి, సంఘర్షణ, అంతకుమించిన మానసిక వేదనలు ఉప్పొంగాయి. దివ్యాంగులను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటున్న సమాజం ట్రాన్స్ జండర్ల విషయంలో ఇంత అమానవీయంగా ప్రవర్తించడం నా మనసును బాధించింది. ఆ క్షణమే నేను డాక్టర్ అవాలనే ఆలోచనకు బీజం పడింది. శారీరకమైన తేడాపాడాల కారణంగానే ట్రాన్స్ జండర్లు అలా ఉంటున్నారన్న అవగాహన చాలామందికి లేదనిపించింది. అందుకే కదా తోటివారి నుంచి ఈ ఛీత్కారాలు, అవమానాలు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. ట్రాన్స్ జండర్ పిల్లల తల్లిదండ్రులు కూడా వారిని తమ బిడ్డలుగా చెప్పుకోవడానికి అవమానంగా ఫీలవడం నన్ను బాధించింది. అందుకే డాక్టరునయి ట్రాన్స్ జండర్లకు అండగా నిలబడాలని నిశ్చయించుకున్నా. అందుకే ఎన్ని ఆటుపోటులు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా చదువును ఆపలేదు. డాక్టరు అవాలనే నా లక్ష్యం దిశగా దూసుకుపోయాను. వారికి నా వైద్యసేవలను ఇప్పుడు అందిస్తున్నాను. అంతేకాదు అందరిలాగే సమాజంలో ట్రాన్స్ జండర్లకు సమానహక్కుల ఉండేలా పాటుపడాలని కూడా నిశ్చయించుకున్నాను. అందుకే నా సెక్సువల్ ఐడెంటిటీని బయటపెట్టకుండా వైద్య విద్యను పూర్తిచేశా. ట్రాన్స్ జండర్లకూ కోరికలుంటాయి. వారికీ తోడు కావాలనిపిస్తుంది. కానీ తమకు కావలసినట్టు బహిరంగంగా బతకలేని స్థితి వాళ్లది. సమాజం తమను ఏమంటుందో, ఎలా చూస్తుందోననే భయం మాలాంటి వారిని ఎప్పుడూ చుట్టుముట్టి ఉంటుంది. ట్రాన్స్ జండర్లమని తెలిసిన క్షణం నుంచి మా పట్ల సమాజం అడుగడుగునా చూపించే వివక్షను తట్టుకోలేక తోటి ట్రాన్సజండర్లే మా ప్రపంచంగా బతుకుతుంటాం. వారితోనే మా ఆనందం, దుఖం, బాధలు,కష్టాలు, జీవితం అన్నీ. అలా బయటప్రపంచం నుంచి తీవ్ర వెలివేతను ట్రాన్సజండర్లు ఎదుర్కొంటున్నారు. నేను కూడా అలాంటి బాధలన్నింటినీ చవిచూశాను. ట్రాన్సజండర్లలో చాలామంది సరిగా చదువుకోకపోవడం వల్ల ఇంటి నుంచి వాళ్లు బయటకు వచ్చిన తర్వాత జీవితం గడవడానికి భిక్షాటన లేదా సెక్స్ వర్కు వంటివి చేస్తున్నారు. సమాజం లో ఎవ్వరూ వారిని తమలో ఒకరిగా కలుపుకోకపోవడం, పనులు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ట్రాన్స్ జండర్లు నెట్టివేయబడుతున్నారు. మాలో ఎందరో పేదరికంతోనే కాదు. అనాథలుగా ఒంటరి జీవితం బతుకుతున్నాం. అనాధలుగానే ప్రపంచం నుంచి సెలవు తీసుకుంటున్నాం. సమాజం చూపే తీవ్ర వివక్ష, దోపిడీ, అన్యాయాలను భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్న ట్రాన్స్ జండర్లు కూడా ఎంతోమంది ఉంటున్నారు. అంతేకాదు కొందరు మగవాళ్లు మాతో కలిసి జీవిస్తామని మాయమాటలు చెప్పి, మా దగ్గర ఉండే డబ్బు వాడుకుని ఆ తర్వాత తమ కుటుంబం చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వారిని హఠాత్తుగా వదిలిలేసి పోతున్న సంఘటనలకు కొదవేలేదు. డాక్టరు చదువుకున్న నేను కూడా నా పరిస్థితిని అమ్మకు చెప్పడానికి ఎంతో ఘర్షణకు లోనయ్యా. చివరకు ఆమెకు చెప్పినపుడు అమ్మ ఎంతో భయపడింది. డాక్టర్ల దగ్గరకు వెళ్లి తగిన చికిత్స తీసుకోమని చెప్పింది. నేను వైద్యుల దగ్గరకు వెడితే వాళ్లు నువ్వు అమ్మాయిలా ఫీలవుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు అంటూ నాకు సూచించారు. ఒక దశలో నా పరిస్థితి చూసి మా అమ్మ తీవ్ర డిప్రషన్ లోకి కూడా వెళ్లిపోయింది. మా అన్నయ్య అయితే కొన్ని సంవత్సరాలపాటు నాతో మాట్లాడలేదు. ఎంబిబిఎస్ అయిన తర్వాత ఉద్యోగం కోసం ఎన్నో ఆస్పత్రులకు కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగా. కానీ ఎక్కడా ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు హైదరాబాదులోనే ట్రాన్సజండర్ల కోసం పనిచేస్తున్న మిత్ర అనే ఒక స్వచ్ఛంద సంస్థలో నన్ను ఇంటర్వ్యూ చేసి నాకు ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు పెట్టుకున్నా. మిత్రలో పనిచేసేటప్పుడు నాకు మంచి వైద్యురాలిగా పేరు వచ్చింది. ఈరోజు ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేసే అవకాశం రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఎంతోమంది పేదలకు వైద్యసేవలు అందించే అదృష్టం కూడా నాకు లభించింది. ఇక్కడకు వచ్చే పేషంట్లు కూడా మమ్మల్ని ఎలాంటి వివక్ష లేకుండా అందరు వైద్యులను చూసినట్టే చూస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారు. తోటి వైద్యులు కూడా ఎంతో గౌరవంగా చూస్తారు. అయితే నేను ఆస్పత్రిలో ఎంత మంచి వైద్యురాలిగా గుర్తింపుపొందినా బయటకు వస్తే మటుకు అందరు నన్ను ఒక ట్రాన్స్ జండర్లలాగే చూస్తారు. అలా నేను ఎన్నో అవమానాల నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నా. ఇది కఠిన సత్యం. ఎంత చదువుకున్నా ఒంటరిగా మేం ఏమీ చేయలేం కదా. అందుకే నేను చెప్పేదేమిటంటే పాఠశాల నుంచి జండర్ ఎడ్యుకేషన్ని పిల్లలకు అందించాలి. మాలాంటి ఎల్ జి బి టిక్యూ కమ్యూనిటీ గురించిన అవగాహనను సమాజంలో అన్ని వయసుల వారికీ, వర్గాలు, కులాలు, మతాల వారికీ కల్పించాలి. అప్పుడే దీన్ని ఒక స్టిగ్మాగా చూడకుండా సాధారణ విషయంగా అందరూ చూడగలుగుతారు. అలాగే అందరితో సమానంగా మేం కూడా సమానహక్కులు అనుభవించినాడే, సమానత్వాన్ని పొందిననాడే మా కమ్యూనిటీ ప్రజల జీవితాలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.