
‘లాపతా లేడీస్’ సినిమా 2025 సంవత్సరం ఆస్కార్ కు భారత అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దీనికి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్, కిరణ్ రావులు కలిసి నిర్మించిన ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని అస్సామీ డైరక్టర్ జానూ బారువా నాయకత్వంలోని పదమూడుమంది సభ్యుల కమిటీ అంతర్జాతీయ ఉత్తమ చిత్రాల కేటగిరిలో దేశ అధికారిక చిత్రంగా ఆస్కార్ ఎంట్రీకీ ఎంపికచేసింది. పిత్రుస్వామ్య వ్యవస్థపై వ్యంగ్యంగా తీసిన ఈ చిత్రం 29 చిత్రాలతో పోటీబడి మరీ ఎంపికైంది.
మన దేశంలోని పిత్రుస్వామ్య వ్యవస్థ స్త్రీలపై ప్రదర్శించే ఆధిక్యధోరణి, భారత మహిళల లొంగుబాటు స్వభావాలను మేళవించి శక్తివంతమైన పాత్రల ద్వారా సునిశితంగా వ్యంగ్యస్త్రాలను సంధిస్తూ దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనదేశ మహిళలే కాదు మొత్తం ప్రపంచంలోని స్త్రీలోకం ఎదుర్కొంటున్న జండర్ అసమానతలను ఈచిత్రం వినోదాత్మకంగానే కాదు ఆలోచనాత్మకంగా కూడా అద్దంపట్టింది. ఒకసందర్భంలో దర్శకురాలు కిరణ్ రావు మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆస్కార్స్ కు వెడితే నా కల ఫలించినట్టే’ అన్నారు కూడా. అలాగే ‘ప్రేక్షకులు, దేశం యావత్తు మా ఈ ప్రయత్నాన్ని మెచ్చితే అది మాకెంతో గొప్ప ప్రశంస’ అని అన్నారు. అది నిజం అయింది.
గ్రామీణ భారతంలో కనిపించే లింగ అసమానత్వం , మహిళా సాధికారతలపై ఈ చిత్రాన్ని నడిపించిన (నెరేట్ చేసిన) తీరు గుండెలకు హత్తుకునేలా ఉండడం చూడొచ్చు. ఈ చిత్రం విద్యావంతులనే కాదు సాధారణ స్త్రీలను కూడా ఎంతగానో కట్టిపడేసింది. సినిమాలోని ప్రధాన పాత్రలైన ఇద్దరు గ్రామీణ వధువుల పాత్రలలో ఎందరో మహిళలు తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు . రణ్ ధీర్ కపూర్ ‘యానిమల్’, కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’, ప్రభాస్ ‘కల్కి 2898’ , జాతీయ అవార్డు పొందిన మళయాళ చిత్రం ‘ఆట్టం’, రాజ్ కుమార్ రావు ‘శ్రీకాంత్’, విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్’ వంటి చిత్రాలతో పోటీపడి మరీ ఆస్కార్ ఎంట్రీలో కిరణ్ రావ్ చిత్రం పైచేయి సాధించింది.
గ్రామీణ జీవితాన్ని ఈ చిత్రం ఎంతో వాస్తవికంగా మన ముందు ఉంచింది. ఇది ఎ రియల్ రూరల్ డ్రామా. ఈ సినిమాలో హాస్యరసం ఉంది. కథనం ఎంతో సస్పెన్స్ గా సాగుతుంది. దర్శకురాలి ‘నేరేటివ్ స్టైల్’ వీక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చిన ఇద్దరు మహిళలు పిత్రుస్వామ్య ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర సంఘర్షణకు లోనవడం ఎంతో వైవిధ్యంగా చూపించారు. ‘లాపతా’ అనే మాటకు అర్థం ‘మిస్సింగ్’. నిజ జీవితంలో చాలామంది మహిళలు తమ జీవితాలలో ఏదో పోగొట్టుకున్నాం … లేదా ఏదో కోల్పోయామన్న భావనతో ఉండడం చూస్తాం. ఆ అంతర్గత వేదనను వ్యక్తీకరించేందుకు ‘లాపతా’ పదాన్ని దర్శకురాలు మెటఫర్ గా ఉపయోగించారనిపిస్తుంది.
గ్రామీణ నేపధ్యానికి చెందిన ఇద్దరు కొత్త వధువులు జయ (ప్రతిభా రత్న),ఫూల్ (నితాన్షి గోయల్) లు తమ సొంత ప్రదేశాలనే (ఊళ్లను) కాదు తమ ‘డెస్టినీ’ని సైతం వారి రైలు ప్రయాణం మార్చిన వైనం మీద ఈ చిత్ర కథ సాగుతుంది. వారి రైలు ‘ప్రయాణం’ వారి ‘జీవన ప్రయాణాన్నే’ సంక్షోభంలో పడేసిన వైనాన్ని ఈ సినిమాని ఎంతో సస్పెన్స్ గా, అదే సమయంలో మరెంతో వినోదంగా, అంతే స్థాయిలో ఇంకెంతో ఆలోచనాత్మకంగా తెరపైన ఎక్కించారు దర్శకురాలు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు నూతన వధువుల జీవితాల చుట్టూ ఈ చిత్రం మొత్తం సాగుతుంది. ఎన్నో కలలతో కట్టుకున్న వాడితో అత్తింటికి బయలుదేరిన వారిద్దరూ రైలు ‘ప్రయాణం’ లో చోటుచేసుకున్న ఒక గందరగోళంతో (ఆ ఇద్దరూ తమ భర్తల ఇంటికి వెళ్లేటప్పుడు రైలు ప్రయాణంలో ఒకరి భార్య ఇంకొకనికి తారుమారవుతారు) ఒకరి భర్త ఇంటికి ఇంకొకరు వెడతారు. ఇది వారి జీవన ప్రయాణాన్ని తల్లకిందులు చేయడం, దాని పరిణామాలను ఈ చిత్రంలో చూస్తాం. ప్రతి మహిళా ‘ఇది మనచిత్రం’ అని ఫీలయ్యేలా దర్శకురాలు ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రాత్రోచితంగానే కాదు అలాంటి పరిస్థితుల్లో ఎలా మనం ప్రవర్తిస్తామో అలాగే ఎంతో సహజంగా సెల్యులాయిడ్ పై కిరణ్ రావ్ చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ఆ ఇద్దరు గ్రామీణ వధువుల జీవన మార్గాలు వేరు. వారి కేరక్టరైజేషన్ లో ఆ ఇద్దరు వధువులను వారిని వారిగానే ప్రేక్షకులు చూశారు. కన్విన్స్ అయ్యారు. మహిళా ప్రేక్షకులు వారి నటనకు మరీ ముగ్ధులయ్యారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన వారు చాలామంది తొలిసారి కెమెరా ముందు నిలిచిన వారు కావడం ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం. ఈ సినిమాలో నటించిన నితాంన్షి గోయల్, స్పర్ష్ శ్రీవాత్సవ, ప్రతిభా రత్న, రవికిషన్ నటన ఎందరినో మెప్పించింది. ఈ చిత్రం 2023, సెప్టెంబరు 8న టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.అంతేకాదు ఈ సినిమా మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం వీక్ ’ లో కూడా ఈ సినిమా ఎందరి ప్రశంసలనో పొందింది.