
ప్రజా యుద్ధ నౌక గద్దర్ కనుమూసారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుండె సంబంధ వ్యాధితో ఆయన ఇటీవల హైదరాబాద్‌లోకి ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గద్దర్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి ఎందురో ప్రముఖులు ఆయనను పరామర్శించారు. అందులో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్‌కు రాజకీయాల్లో ఎట్లా మెసులుకోవాలో చెప్పిన గద్దర్ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన ఇంత హఠాత్తుగా మరణిస్తారని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్ మరణ వార్త తెలుసుకొని ఇపుడిపుడే ఒక్కక్కరుగా వెంకటాపూర్‌లోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
పీడిత, తాడిత ప్రజలకు తీరని లోటు : రేవంత్
గద్దర్ మరణ వార్త తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను తలపెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సును వెంటనే రద్దు చేసుకున్నారు. గద్దర్ మరణం పీడిత, తాడిత ప్రజలకు తీరని లోటని అన్నారు. దశాబ్ధాల కాలంగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటని ప్రకటనలో అభివర్ణించారు.