
తమిళనాడులో ముగ్గులకు ఓ ప్రత్యేకస్థానం. ధనుర్మాసం రావడంతోనే తమిళనాడులోని వీధులు రంగవల్లికలతో కొత్త అందాలను సంతరించుకుంటాయి. సరిగ్గా ఈ సమయంలోనే ముగ్గుల పోటీలు జరుగుతాయి. అన్నింటిలోనూ చెన్నైలోని మైలాపూర్‌లో జరిగే కోలం పోటీలు సుప్రసిద్ధమయ్యాయి. 2001లో స్థానిక దినపత్రిక ఆధ్వర్యంలో మొదలైన ఈ పోటీలు ఇప్పుడు మెగా ఈవెంట్‌గా మారాయి. ఇవాళ్టి నుంచి మొదలైన ఈ మెగా ఉత్సవం 11వ తేదీ వరకు కొనసాగుతోంది. ముగ్గుల పోటీలే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్ర్తీయ సంగీత నృత్య రూపకాలు, జానపదాలు, లలిత కళలు, హస్తకళలు ఇలా అన్ని కలిపి ఓ మహోత్సవాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపచేస్తాయి.
సుమారు పాతికేళ్ల కిందట మైలాపూర్‌లో సింపుల్‌గా కోలం కాంపిటీషన్ మొదలయ్యింది. ఆ తర్వాత మైలాపూర్ ఫెస్టివల్‌గా ఎదిగింది.. ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకునే ప్రధాన ఉత్సవంగా రూపాంతరం చెందింది. నిజానికి మైలాపూర్ చెన్నై నగరానికి ఆత్మలాంటిది. చెన్నై పుట్టకముందే మైలాపూర్ ఓ పట్టణంగా భాసిల్లింది. ఇదో చారిత్రాత్మక ప్రదేశం. తమ ప్రాంతపు అస్థిత్వాన్ని, గొప్పదనాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, వారసత్వపు కట్టడాలను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశమే మైలాపూర్ ఫెస్టివల్ నిర్వహణకు ప్రధాన కారణం.
లలితకళలకు, సంస్కృతీసంప్రదాయాలకు అద్భుతమైన వాస్తుశిల్ప చాతుర్యానికి పెట్టింది పేరు మైలాపూర్! మైలాపూర్‌ను సుప్రసిద్ధం చేసిన కపాలీశ్వర ఆలయం ప్రాంగణంలో, పరిసరాల్లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఫెస్టివల్లో భాగంగా హెరిటేజ్ వాక్ జరుగుతుంది. ఇక ఫుడ్‌స్ర్టీట్ ప్రత్యేకం!
ఫెస్టివల్లో ప్రధానమైనది కోలం అంటే ముగ్గుల పోటీ. వీటిని శని, ఆదివారాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయ మాడా వీధిలో జరుగుతాయి. ఇక హెరిటేజ్ వాక్‌లో మైలాపూర్‌లోని చారిత్రిక భవనాలు, ప్రదేశాల సందర్శన ఉంటుంది. కపాలీశ్వర ఆలయ తూర్పు గోపురం వెలుపల ఉన్న 16 కాళ్ల పండటం దగ్గర ప్రతి రోజూ సాయంత్రం శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, నాటక ప్రదర్శనలు ఉంటాయి. పిల్లలకు చదరంగ పోటీలు కూడా నిర్వహిస్తారు.
