
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సూరత్ కోర్టులో మోదీ అనే పేరు గలవారు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసులో రాహుల్కు సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తరహా శిక్షతో పార్లమెంట్ సభ్యునిపై అనర్హత వేటు పడుతుంది. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. ఈ క్రమంలోనే రాహుల్ వయనాడ్ ఎంపీగా అర్హత కోల్పోయినట్లు లోక్సభ సెక్రటరీ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో కేసు విచారణ జరిగింది. ఉన్నత న్యాయ స్థానం సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. దాంతో రాహుల్ తిరిగి చట్టసభల ప్రతినిధిగా అర్హత సాధించారు. కోర్టు తీర్పును అనుసరించి లోక్సభ స్పీకర్ సోమవారం రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏమిటి కేసు?
రాహుల్ గాంధీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ నీరవ్ మోదీ, లలిత్ మోదీల పేర్లను ఉద్దేశిస్తూ ఆయన ‘మోదీ’ పేరున్న వాళ్లు ఇలాగే ఉంటారా అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల్లో నర్మగర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన కూడా ఉన్నదన్న తీరులో రాహుల్ మాట్లాడారు. కాగా మోదీ పేరున్న వాళ్లందరినీ అవమానపరిచేలా రాహుల్ వ్యాఖ్యలున్నాయని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష వేసింది.