
గద్దర్ అంతిమ యాత్రకు వేలాది మంది కళాకారులు తరలివచ్చారు. దాదాపు పదివేల మంది కళాకారులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నిజానికి ఆదివారం రాత్రి నుంచి ఎల్బీ స్టేడియం ఆవరణ కళాకారుల ఆటపాటలతో హోరెత్తాయి. దేశంలోనే సాంస్కృతిక పునర్నిర్మాణానికి ఆద్యునిగా చెప్పుకునే గద్దర్‌కు తమ కృతజ్ఞతలు చాటుకునేందుకు డప్పు కళాకారులు, గాయకులు, వివిధ సాంస్కృతిక కళారూపాల కళాకారులు తరలి వచ్చారు. ఎల్బీ స్టేడియం ప్రాంగణంతోపాటు గద్దర్ అంతిమ యాత్ర పొడుగునా ఈ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన జరిగింది. డప్పుల మోతలు, గాయకుల జోహోర్ల గేయాలతో సోమవారం హైదరాబాద్ వీధులు దద్దరిల్లాయి.