
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఐక్యత అవసరమని, లీడర్లు ఐక్యంగా ఉండేలా దిశానిర్దేశం చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పార్టీ అధినేత్రి సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలంటే తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఆయన సోనియా గాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పునర్వైభవాన్ని సంతరించుకుంది. మళ్లీ అధికారం దిశగా సాగుతున్నది. తెలంగాణ ఇచ్చినందుకు మిమ్మల్ని తెలంగాణ తల్లిగా కొలుస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో పార్టీ పునరుత్తేజానికి సంబంధించి మీరు చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అన్యాయానికి గురవుతున్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా అందరికీ తెలంగాణ తల్లి అయిన మీ దిశానిర్దేశం తప్పనిసరి’’ అని లేఖలో పేర్కొన్నారు.
ఈ తొమ్మిది అంశాలను యాదిలో పెట్టుకోండి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అధిష్ఠానం కచ్చితంగా తొమ్మిది అంశాలను యాదిలో పెట్టుకోవాలని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఆ తొమ్మిది అంశాలివి…
- తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడి, ప్రాణాలను సైతం అర్పించిన అమరులకు పార్టీ మేనిఫెస్టోలో తగిన ప్రాధాన్యం కల్పించాలి. ఉద్యమకారులకు తగిన గుర్తింపునిచ్చేలా మేనిఫెస్టోలో పొందుపరచాలి. పార్టీలోకి ఉద్యమకారులను, స్వాతంత్ర్య సమరయోధులను ఆహ్వానిద్దాం.
- ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గత ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, యాక్టివిస్టులను గుర్తించి అవకాశాలివ్వాలి. అన్యాయాలు, అక్రమాలపై పోరాడేందుకు వారికి అవకాశం ఇవ్వడం అత్యావశ్యకం.
- గెలిచాక స్వార్థం కోసం పార్టీలు మారే వారిపై, వెన్నుపోటు పొడిచే వారిపై కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిని ముందే గుర్తించి టికెట్లు ఇవ్వకుండా చూడాలి. నమ్మకం ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలి. దాని వల్ల పార్టీ సమగ్రతను కాపాడినవాళ్లమవుతాం. అవకాశవాద రాజకీయాలకు కళ్లెం వేసిన వాళ్లమవుతాం.
- మన పార్టీ నుంచి నేతలను తీసుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు ప్రయోగించే కుటిల వ్యూహాలకు చెక్‌పెట్టేలా సమర్థమైన వ్యూహాలనూ రూపొందించాల్సిన అవసరం ఉంది. పార్టీ నేతల మధ్య ఐక్యత పెంపొందించడం వల్ల పార్టీ సిద్ధాంతాలను రక్షించేందుకు వీలవుతుంది.
- పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కష్టపడుతున్న నేతలను గుర్తించి పార్టీలోని కీలక పదవుల్లో చోటు కల్పించాలి. అలాంటి నాయకుల అభిప్రాయాలను వినడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
- రాజకీయాలంటే సంపాదించుకోవడమేనన్న భావనలో ఉండే నేతలు, అవకాశవాదాన్ని నిరోధించడం ద్వారా తెలంగాణ భవిష్యత్ అవసరాలను కాపాడవచ్చు. సమగ్రత, జవాబుదారీతనం, ప్రజాసేవా వంటి వాటిని నేతల్లో పెంపొందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా తెలంగాణను స్వప్రయోజనాల కోసం దోచుకోవాలని చూసే విచ్ఛిన్నకర శక్తుల నుంచి రక్షించవచ్చును.
- ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజ్యాంగబద్ధమైన రాజకీయాలను వారికి వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విలువలను పటిష్ఠం చేసేందుకు ప్రజలు అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేలా చేయాల్సిన అవసరం ఉంది.
- పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు వారికి ఉద్యోగ కల్పన, నిరుద్యోగ సమస్య నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉండాలి.
- వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రతిపాదించినట్టు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని చేయాలి. రైతు డిక్లరేషన్‌ను తూచా తప్పకుండా అమలు చేయాలి.