
బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ
రైతుల రుణ మాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పినకేసీఆర్ ఈమేరకు సోమవారం ఎందుకు తగిన ఆదేశాలిచ్చారు. 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెల్సిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
ఇప్పటికే 50 వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి సర్కారు 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతురుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నది. తాజాగా 99వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేసింది.