బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ, సిపిఎం, వైఎస్సార్టిపీల నాయకత్వాన్ని అణగారిన వర్గాలకు ఇవ్వండని ఏడు రాజకీయ పార్టీలకు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ బహిరంగ లేఖ రాశారు. మంగళవారం ఆయన ధర్మ సమాజ్ పార్టీ స్టేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖను విడుదల చేస్తూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 93శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉండగా ఏడు శాతం లేని అగ్రకులాలు బి ఆర్ ఎస్, బీజేపీ , కాంగ్రెస్ , టీజే ఎస్ , సిపిఐ , సిపిఎం , వైస్సార్టీ పార్టీలకు నాయకత్వం వహించడమేమిటి ప్రశ్నించారు. ఇది పూర్తిగా సామాజిక న్యాయ సూత్రానికి, భారత రాజ్యాంగ సమానత్వ భావనకి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అందుకే ఈ ఏడు అగ్రకుల పార్టీల వైఖరిని ‘ధర్మ సమాజ్ పార్టీ’ తీవ్రంగా నిరసిస్తుందని అన్నారు. ఏడు పార్టీలు 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ద్రోహం చేస్తున్నట్లుగా భావిస్తున్నామని తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉందనీ, విప్లవాల ఖిల్లాగా ఉగ్గుపాలతో విప్లవాన్ని నూరిపోస్తుందని అనేక పోరాటాలు జరిగాయని చెబుతున్న ఈ తెలంగాణలో నిసిగ్గుగా 7 శాతం లేని అగ్రకులాలు 7 పార్టీలను ఏర్పాటు చేసుకుని, ఆ పార్టీలను తమ అగ్రకుల ఆధిపత్యంలోనే ఉంచుకొని, తమ సంస్థాగత నిర్మాణ నాయకత్వంలో తాము ఏర్పాటు చేసే ప్రభుత్వాలలో అణగారిన కులాలను పొరపాటున రానివ్వకుండా ప్లాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది తీవ్ర సామాజిక నేరంగా భావిస్తూ ఉన్నామని దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొన్నారు.
ఏడు రాజకీయ పార్టీల ముందు ఏడు డిమాండ్స్ 1. మీ మీ పార్టీలలో అధి నాయకత్వాన్ని బీసీలకు కేటాయించండి. గ్రామస్థాయి వరకు సంస్థాగత నిర్మాణంలో మీ పార్టీని 90 శాతం
అణగారిన కులాలకు నాయకత్వం అప్పచెప్పండని డిమాండ్ చేశారు.
- మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థానాన్ని దళితుడికి కేటాయించండి.
- క్యాబినెట్ అంతా 93% అనగారిన బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించండి.
- మీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లో 90 శాతం అణగారిన కులాలకే కేటాయించండి.
- రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ నుండి రాష్ట్ర బ్యూరోక్రసీ ఉన్నతాధికారులందర్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులతో నింపండి.
- మీ మీ పార్టీలు ఇచ్చే ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థలలో టికెట్స్ మొత్తంలో 93% బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించండి.
- మా పార్టీలలో అగ్రకుల ఆధిపత్యం లేదు, సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామనే బోర్డు పెట్టండిని అన్నారు.
రాబోయే 15 రోజులలో (ఆగస్టు 30 వరకు) కనీసం మొదటి డిమాండ్ ఐన “ఏడు రాజకీయ పార్టీల అధ్యక్ష స్థానం వెంటనే” అణగారిన కులాలకు కేటాయించాలని
ఈ డిమాండ్లను మీరు అమలు చేయకపోతే, 10 శాతం లోపు ఉన్న 7 రాజకీయ పార్టీల ‘సామాజిక ద్రోహాన్ని’ ప్రజల ముందు ఎండగట్టి’ దోషిగా నిలబెడతామని చెప్పారు.
అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడు రాజకీయ పార్టీల ముందు “నిరసనలు దీక్షలు, ధర్నాలు” చేపడతాం. ఈ పార్టీలన్నింటినీ ప్రజలలో తిరగనివ్వం. ఈ ఏడు పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నాయకత్వం ఇచ్చే సామాజిక న్యాయం వైపా..? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నాయకత్వం ఇవ్వకుండా, అగ్రకుల ఆధిపత్యం కొనసాగించే సామాజిక అన్యాయం వైపా..? తేల్చుకోవాలని అన్నారు.