డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన మూడు ప్రార్థనా మందిరాలు ఒకే రోజు వరుసగా ఆవిష్కృతమయ్యాయి.
ఇప్పటికే ప్రారంభమైన సచివాలయంలో ఉద్యోగుల ఆధ్యాత్మిక అవసరాల కోసం వారి వారి మత సాంప్రదాయల ప్రకారం పున:ప్రతిష్ట చేసుకున్న హిందూ నల్ల పోచమ్మ దేవాలయం, క్రైస్తవ చర్చి, ఇస్లాం మతస్థులకు మసీదు లను శుక్రవారం సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు.
తొలుత, నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైన సెక్రటేరియట్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. గవర్నర్ రాక కోసం వేచి చూసి వారు రాగానే సాంప్రదాయ పద్ధతిలో మేళ తాళాలతో ఆహ్వానం పలికారు. గవర్నర్ ను ఆహ్వానించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గారితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సీఎస్, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
అప్పటికే కొనసాగుతున్న పూజా కార్యక్రమాల్లో సీఎం, గవర్నర్ గారు లు పాల్గొన్నారు. చండీయాగం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. అదే సందర్భంలో ఆలయ ప్రాంగణంలలోని అనుబంధంగా ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన చర్చికి, గవర్నర్ గారిని తోడ్కొని సీఎం కేసీఆర్ గారు చేరుకున్నారు. క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఫాస్టర్ తదితర మత పెద్దలు క్రీస్తు సందేశాన్ని వినిపించారు.సంప్రదాయం ప్రకారం కేక్ ను కట్ చేశారు.
అనంతరం పక్కనే నిర్మించిన మసీదుకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ తో పాటుగా వచ్చిన సీఎం గారికి ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఇమామ్, తదితర మత పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో సిఎం పాల్గొన్నారు. మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఇస్లాం మత పెద్దలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…
“ఇది చాలా సంతోషకరమైన సమయం. మన పై అల్లా దయ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి. ఇందుకోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తుంది. ఈ దిశగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. పాత సెక్రటేరియలోని మసీదును మించి కొత్త సెక్రటేరియల్ లో మసీదును సుందరంగా నిర్మించుకోవడం నాకు చాలా సంతోషాన్నిస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు యావత్ భారతదేశంలోని ముస్లింలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. లౌకికత్వాన్ని చాటేలా ఆలయాలు, మసీదులు, చర్చిలు వెలయాలి. ఈ మూడు ఒక్కచోట ఉన్న ప్రదేశానికి ఉత్తమ నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిలుస్తుంది. హిందూ,ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కలిసిమెలిసి ముందుకు సాగుతూ, ప్రార్థనలు చేసుకొంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారు. యావత్ భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధమైన సహృద్భావ పరిస్థితులు సదా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఎల్లవేళలా శాంతి నెలకొని ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను.” అని తెలిపారు.
అనంతరం సెక్రటేరియట్ సందర్శన కోసం గవర్నర్ గారిని తోడ్కొని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. వారికి సచివాలయ ప్రాంగణాన్ని కలియదిరిగి చూయించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరించారు. అనంతరం గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ.. సీఎం కేసీఆర్ తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్లి, శాలువాతో సత్కరించి పూల బోకెను అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బొట్టు కుంకుమలతో గవర్నర్ గారిని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం హై‘టీ’ తో గవర్నర్ కు సిఎం కేసీఆర్ ఆతిథ్య మిచ్చారు.