
‘‘అందరూ ఒకే కుటుంబం నుంచి ఇంత మంది హీరోలు ఉన్నారని మా గురించి అనుకుంటారు. కానీ అట్లా రావడానికి మేం గొడ్డు చాకిరీ చేస్తాం. కష్టనష్టాలు భరిస్తాం. సినిమా ఏ ఒక్కరి సొంతం కాదు. ఎవరైనా ఈ ఫీల్డ్‌లోకి రావొచ్చు. కష్టపడేవాళ్లే ఇందులో నిలదొక్కుకోగలుతారు. రాజకీయం అయినా అంతే” అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తన మేనల్లుడు సాయి తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా హీరోలంటే నాకు చాలా ఇష్టం. కష్టపడతారు. నిజాయితీగా ఉంటారు. ఎవరినీ దోపిడీ చేయరు. సిన్సియర్‌గా పన్నులు కడతారు. సినిమాను సినిమాగా చూద్దాం. అక్కడ రాజకీయాలు వదిలేద్దాం” అని ఆయన అన్నారు. ‘‘నేను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లాగా గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు. ప్రభాస్, రాణాలాగా కొన్నాళ్లపాటు ఏకధాటిగా శ్రమించలేకపోవచ్చు. కానీ నా సినిమా హిట్టు విషయంలో మాత్రం రాజీ పడన’’ని చెప్పారు. త్రికరణ శుధ్దిగా పని చేయడం వల్లే కోట్లాది మంది అభిమానం సంపాదించగలిగానని ఆయన తన సీక్రేట్ వివరించారు.