
తెలంగాణలోని అత్యధిక భూభాగానికి నీళ్లందించే ఎస్సారెస్పీ (శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు)కి నేటితో (జులై 26) అరవై ఏళ్లు నిండాయి. 1963లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అంటే ఆ రోజు నుంచి పనులు ప్రారంభమయ్యాయి. 1977లో ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టను పోచంపాడ్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పూర్వ కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టును తెలంగాణలోకి గోదావరి ప్రవేశించిన 54.50 కిలో మీటర్ల దిగువన నిర్మించారు. ఆదిలాబాద్ (ప్రస్తుత నిర్మల్) జిల్లాలోని బాసర వద్ద గోదావరి రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 42 గేట్లు ఉంటాయి. ప్రాజెక్టు నుంచి కాకతీయ కెనాల్ (346 కిలోమీటర్లు), లక్ష్మి కెనాల్, సరస్వతీ కెనాల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్లు నిర్మించి సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేలా రూపొందించారు.