
కత్తులతో తిరిగాడు.. హల్చల్ చేశాడు. నెమ్మదిగా రాజకీయం నేర్చుకున్నాడు. సెటిల్మెంట్లకు దిగాడు. ఈ మధ్య ఒక సెటిల్ మెంట్ వ్యవహారం బెడిసికొట్టింది. అంతే ఆ రౌడీషీటర్ దారుణంగా చచ్చాడు..
అసలేం జరిగిందంటే..
వరంగల్‌లోని శివనగర్‌లో రౌడీషీటర్ సయ్యద్ నజీర్ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి దుండగులు కత్తులతో దారుణంగా హతమార్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సుమారు 11 మంది నజీర్‌ను చుట్టుముట్టి రాడ్లతో దాడి చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
ఇలా గొడవకు దారితీసింది..
సయ్యద్ నజీర్ శివనగర్‌లోని తన అత్తగారింట్లో ఉంటూ వరంగల్ రైల్వేస్టేషన్లో స్టాల్ నిర్వహిస్తున్నాడు. అతడికి రైళ్లలో కీ చైన్లు విక్రయించే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారితో పరిచయం ఏర్పడింది. వారు రైల్వేస్టేషన్‌కి సమీపంలో గది తీసుకుని ఉంటున్నారు. 15 రోజుల క్రితం శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తితో ఉత్తర్‌ప్రదేశ్ వ్యక్తులు గొడవపడ్డారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ సమీపంలోని బార్ వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఘర్షణ పడిన ఇద్దరి మధ్య నజీర్ సయోధ్య కుదిర్చాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు ఉంటున్న ఇంటికి అతడు వెళ్లాడు. అక్కడ నజీర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారంతా చుట్టుముట్టి రాడ్లతో నజీర్పై దాడి చేసి చంపేశారు.
ఒక్కడు తప్ప అంతా జంప్..
అనంతరం 11 మంది అర్ధరాత్రే పారిపోగా.. వికాస్ అనే యూపీ వాసి మాత్రం తన భార్య గర్భంతో ఉండటంతో వెళ్లకుండా ఉండిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గురైన నజీర్ వెంట ఉన్న ఉమేశ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇతను దొరికితే..
ఉమేశ్ దొరికితే ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నజీర్‌కు భార్య రిజ్వానా బేగం, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నజీర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ సీఐ సురేశ్ కుమార్ తెలిపారు.