
వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు పూర్తి స్థాయి నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఆమె గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత సోనియా గాంధీని కలిశారు. తన పార్టీని విలీనం చేస్తాననీ, తనకు సముచిత స్థానం కల్పించాలని షర్మిల ఈ సందర్భంగా సోనియాను కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఏపీకి వెళ్లి పార్టీకి పునరుత్తేజం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ షర్మిల తెలంగాణలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అయితే తెలంగాణలోకి షర్మిల ఎంట్రీని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షర్మిల పార్టీ పెట్టిన తొలి నాళ్లలో రేవంత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను షర్మిల కిరాయి లీడర్‌గా అభివర్ణించారు. దాంతో రేవంత్ వైఎస్సాఆర్ టీపీ రాజకీయ పార్టీ కాదనీ, అది ఎన్జీవో అని అన్నారు. అయితే కాలక్రమంలో షర్మిల కర్నాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్‌ను కలిసిన తర్వాత సీన్ మారింది. షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ గురించి టాక్ మొదలైంది. దీనిపై రేవంత్ మాట్లాడుతూ తమ పార్టీలోకి ఎవరైనా రావొచ్చునన్నారు. షర్మిల వచ్చి ఏపీలో పని చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. రేవంత్ లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ఆమెను ఏపీకి వెళ్లమని చెబుతున్నట్లు తెలిసింది. కానీ షర్మిల తాను తెలంగాణలో మూడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశాననీ, తనను ఇక్కడే ఒకచోట టికెట్ ఇచ్చి, మంచి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. షర్మిల తన భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి సోనియా వద్దకు వెళ్లారు.