
• కేన్సర్, ఇతర అసంక్రమిత వ్యాధులు పెరగడం ఆందోళనకరం
• చిరుధాన్యాల వాడకం పెరగాలి
• వైద్యులు ప్రజల్లో అవగాహన పెంచాలి• సామాజిక ఆరోగ్యానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
• భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ వెంకయ్య నాయుడు పిలుపు
• ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్టులో ఉచిత వైద్యశిబిరం
హైదరాబాద్: నానాటికీ పెరుగుతున్న కేన్సర్, జీవనశైలి వ్యాధులను అరికట్టడానికి మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పునరుద్ధరించుకోవడం అత్యవసరమని భారత పూర్వ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ దిశగా వైద్యనిపుణులు ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం హైదరాబాద్ మచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్టులో స్వర్ణభారత్ ట్రస్టు, కేర్ ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ వెంకయ్యనాయుడు ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికీ పెరుగుతున్న కేన్సర్ వ్యాధితో అది సోకిన వారు తీవ్రమైన బాధను అనుభవించడమే కాకుండా, వారి కుటుంబాలు అల్లకల్లోలమై, ఆర్థికంగా చితికిపోతున్నాయని చెప్పారు. పిల్లల చదువులు అర్ధంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సంక్షోభమని, నివారణకు అటు వైద్యులు, ఇటు కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు అత్యవసర చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పొగాకు వాడకం వల్ల ఈశాన్య రాష్ర్టాల్లో ఊపిరితిత్తుల కేన్సర్ పెరుగుతోందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయని, తెలుగు రాష్ర్టాల్లోనూ పొగాకు వాడకం ఎక్కువగానే ఉందని, పొగాకు, పొగాకు ఉత్పత్తుల సేవనం వల్ల వచ్చే నష్టాలను వైద్యులు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పొగాకు సేవనాన్ని పూర్తిగా మానేసేలా వైద్య నిపుణులు చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కేన్సర్ ఒక వైపు ముంచుకొస్తుండగా మరోవైపు ఊబకాయం, మదుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయని , ఇది తీవ్ర ఆందోళనకరమని వెంకయ్యనాయుడు చెప్పారు. తెలంగాణ గ్రామాల్లో ఊబకాయం ప్రబలంగా వ్యాపిస్తోందని ఇక్రిశాట్ ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడయిందని నాయుడు చెప్పారు.
సంప్రదాయ భారతీయ ఆహారం తీసుకోవడం తగ్గి దుకాణాల్లో సిద్ధంగా ఉన్న ప్యాకేజ్ ఫుడ్ తీసుకోవడం తెలంగాణ పల్లెల్లో పెరిగిందని, వాటిల్లో పిండిపదార్థాలు, చక్కెర పదార్థాలు ఎక్కువ అని, ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారానికి ప్రజలు దూరమవుతున్నారని ఇక్రిశాట్ అధ్యయనంలో వెల్లడయిందని, ఇది చాలా ఆందోళనకరమైన అంశమని చెప్పారు. ప్రజలు స్థానికంగా సంప్రదాయంగా పండే చిరుధాన్యాల వంటి ఆహారాన్ని వదిలి ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్ కు అలవాటు పడడానికి ప్రధాన కారణం సమతుల ఆహారపు ఖర్చుతో పోల్చుకుంటే పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తక్కువ ధరలకు లభించడం, ప్యాకింగ్ చేయడం వల్ల వాటి నిల్వ కాలం ఎక్కువగా ఉండడం, అవి తమకు అత్యంత సమీపంలో దుకాణాల్లో సులువుగా అందుబాటులో ఉండడం, తినడానికి సిద్ధంగా ఉండడం అని ఇక్రిశాట్ అధ్యయనంలో తేలిన సంగతిని గుర్తు చేశారు. దీనికి వెంటనే ప్రభుత్వాలు తగిన పరిష్కారాలతో అత్యవసరంగా ముందుకు రావాలని, ముందుగా ఇటువంటి ఆహారం ద్వారా ఆరోగ్యానికి కలిగే చేటుపై బాగా ప్రచారం చేయాలని, అవగాహన కల్పించాలని సూచించారు. వీటికి ప్రత్యామ్నాయ ఆహారం అంతే సులువుగా అందుబాటులో ఉంచాలన్నారు.
ఎప్పుడైనా తాజాగా వండుకోవడమే మేలని, కాని పక్షంలో చిరుధాన్యాలతో సిద్ధం చేసి పోషకాహార ఉత్పత్తులను ఆకర్షణీయ ప్యాక్ లలో దుకాణాల్లో అందుబాటులో ఉంచేలా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ఇది కొంతలో కొంత మేలని చెప్పారు.ఏదైనా ధర అనేది ఉత్పత్తి-సరఫరా సూత్రంపైనే ఆధారపడి ఉంటుందని గుర్తు చేస్తూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు తగిన గిట్టుబాటు ధరలు అందేలా చూస్తూ చిరుధాన్యాల సాగు పెంచేలా రైతాంగాన్ని ప్రోత్సహిస్తే ఆరోగ్యకరమైన ఆహారధాన్యాల ధరలూ అందుబాటులోనే ఉంటాయని చెప్పారు. రైతాంగం, ఆహారశుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్ వీటన్నింటినీ ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ సమాజంలో శీఘ్ర మార్పులు తీసుకురావడం అత్యవసరమన్నారు.
ఈ విషయంలో ప్రజలకూ బాధ్యత ఉందని, ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకోవాలని శ్రీ వెంకయ్యనాయుడు సూచించారు. కల్తీ ఆహారం, జంక్ ఫుడ్ (ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్) ఎక్కువగా తినడం వల్ల పోషకాల సమతౌల్యం బాగా దెబ్బతిని జీవనశైలి వ్యాధులు ముంచుకొస్తున్నాయని చెప్పారు. కేన్సర్, జీవనశైలి వ్యాధులు పెరగడం ఆరోగ్యసంక్షోభానికి సంకేతమని, వీటికి చికిత్స కన్నా నివారణే మేలని స్పష్టం చేశారు. జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉండడం, తాజా కూరగూయలతో, చిరుధాన్యాలతో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం, తాజా పండ్లు తినడం, నిత్య వ్యాయామం, శారీరక శ్రమ ఉత్తమమైన నివారణ మార్గాలని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవని చెప్పారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు,అరికెలు వంటి చిరుధాన్యాల వాడకాన్ని పెంచుకోవాలని సూచించారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ విధాన నిర్ణయాల్లో ఈ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పత్రికలు, ప్రచార, ప్రసారసాధనాలు, డిటిజిల్ మీడియా కూడా వీటికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వారిలో అవగాహన కల్పించి, తగిన చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన ఆహారంపై పత్రికలు ప్రత్యేకంగా ఆహారకాలమ్ ప్రారంభించాలని సూచించారు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని, కుటుంబం ఆరోగ్యంగా ఉంటనే సమాజం, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే ప్రాంతం, ఆ తర్వాత దేశం ఆరోగ్యంగా ఉంటాయని, దేశం శక్తిమంతం అవుతుందని వెంకయ్యనాయుడు విశదీకరించారు. అందుకే కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఆరోగ్య పరిరక్షణ సామాజిక ఉద్యమంగా మారాలని అభిలషించారు. వినికిడి లోపం ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలకు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కేర్ ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్ర్తచికిత్స చేస్తున్నారని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా సూచించారు. ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలకు ఈ సమస్య ఉంటే సకాలంలో వైద్యుల వద్దకు తీసుకెళ్తే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. కేర్ ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్యశిబిరంలో పలువురికి పరీక్షలు నిర్వహించి అవసరమయిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిస్వార్థ సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందిని వెంకయ్యనాయుడు అభినందించారు.