
సమ్మె విరమణకు ఒప్పందం
తమ సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయడం, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచనతో ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరపడం జరిగింది. శుక్రవారం మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించాం. ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్టీయూ తదితర సంఘాల లీడర్లు, కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ప్రతినిధులు చర్చలకు వచ్చారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు మంచి వేతనాలను చెల్లిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వారికి గుర్తు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమవుతూ, వారికి వైద్య సేవలు అందించే ఏఎన్ఎంలు సమ్మె చేయడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను కూడా వారికి వివరించడం జరిగింది. ఏఎన్ఎంల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నందున, సమ్మె విరమించి విధుల్లో చేరాలని వారికి సూచించాం.
సమ్మె విరమణకు ఒప్పందం
కాంట్రాక్ట్ ఏఎన్ఎంల డిమాండ్ల అమలునకు ఉన్న సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలని వారు కోరుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, కమిటీ వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ వేస్తున్న అంశాన్ని కూడా ఏఎన్ఎంలకు వివరిస్తూనే, సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశాం. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించారు. కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచే సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ నాటికి కమిటీ వేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరగుతుందని డాక్టర్ గడల శ్రీనివాస్ తెలిపారు.