
వ్యక్తిగత కారణాలతో మున్నేటిలో దూకి ఓ యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలోని తీర్దాల-కామంచికల్ బ్రిడ్జి వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళ గూడెం గ్రామానికి చెందిన కటకం నరేష్ (34) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఖమ్మం నగరంలో నివసిస్తున్నాడు. ఇతను 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో (శుక్రవారం) బ్రిడ్జిపై వాహనాన్ని నిలుపుదల చేసి చొక్కా, పర్సును అక్కడే వదిలేశాడు. ఈ సమయంలో తీర్థాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు కామంచికల్ నుంచి ఖమ్మం వెళ్తూ బ్రిడ్జిపై చూశాడు. ఎవరో చేపల కోసం వెళ్లి ఉంటారు అనుకుని వెళ్లి తిరిగి వస్తుండగా అవి అంతే అక్కడే ఉండిపోయాయి . దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి స్థానిక సర్పంచ్ తేజావత్ బాలకృష్ణ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో శవం నీటిలో తేలియాడటాన్ని గమనించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.