
పర్యావరణహితంగా… ప్రపంచంలోనే దీటుగా…
23 కిలో మీటర్ల పొడవున ఇరువైపుల పూలవనాలతో పచ్చదనం
ట్రిప్రొటెక్షన్ కమిటీ అనుమతులకు లోబడి గ్రీనరీపనులు
– హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్
హైదరాబాద్ : ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ త్వరలో అందుబాటులోకి రానున్నది.
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సరసన దాదాపు 23 కిలోమీటర్ల పొడుగునా అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) సోలార్ సైకిల్ ట్రాక్ త్వరలో ప్రారంభం కానున్నది.
ఓఆర్ఆర్ సోలార్ సైకిల్ ట్రాక్ పనులు చివరి దశకు చేరుకున్నాయని హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (హెచ్.జి.సి.ఎల్) చీఫ్ జనరల్ మేనేజర్ రవీందర్ వివరించారు.
సోలార్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో కొన్ని చెట్లను తొలగించినట్లుగా వస్తున్న వార్తలను వారు ఖండించారు.
వాస్తవానికి సోలార్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో తాము నిర్దేశిత ప్రమాణాలను పాటించామని సోలార్ లైటింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాట్లలో భాగంగా కొన్నిచోట్ల మొక్కలను తాత్కాలిక ప్రాతిపదికన తీసి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు పూర్తి అయిన తదుపరి వాటిని అదే ప్రాంతంలో ఏర్పాటు చేశామని అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్ స్పష్టం చేశారు.
హెచ్ఎండిఏ మొక్కల పెంపకం విషయంలో, గ్రీనరీ ఏర్పాటు విషయంలో ప్రజల మన్ననలు, ప్రశంసలు పొందుతుందని, సోలార్ ట్రాక్ నిర్మాణం అంశంలో ఎక్కడా కూడా పచ్చదనం పట్ల నిర్లక్ష్యం వహించలేదని డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు.
అవసరమైన చోట్ల, సందర్భాన్ని బట్టి ట్రిప్రొటెక్షన్ కమిటీ అనుమతులకు లోబడి హెచ్ఎండిఏ బాధ్యతాయుతంగా పనులు నిర్వహిస్తుందని అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్ వివరించారు.
కొన్ని ఎన్జీవో సంస్థలు ఉద్దేశపూర్వకంగా హెచ్ఎండిఏ చేస్తున్న అనేక అభివృద్ధి పనులు, గ్రీనరీ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టులపై ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నాయని ఇలాంటి వాటిని హెచ్ఎండిఏ ఇకపై తీవ్రంగా పరిగణిస్తుందని డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు.