
జగిత్యాల మర్డర్ కేస్ మిస్టరీ వీడింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలు చెల్లెనే అని తేలింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి (22) పోయిన నెల 28న తన ఇంట్లోనే హత్యకు గురై కనిపించింది. ఆమెతో పాటు ఉన్న చెల్లెలు చందన (19) కనిపించకుండా పోయింది. దాంతో పోలీసులు దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మిస్టరీని త్వరగానే చేధించగలిగారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. దీప్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం వర్కఫ్రమ్ హోం చేస్తూ ఇంటి వద్దే ఉంటోంది. చెల్లెలు చందన హైదరాబాద్‌లో ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. హైదరాబాద్‌లో ఉండే సమయంలో చందన అక్కడే ఉండే ఉమర్ షేక్ సుల్తాన్‌ను ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో అంగీకరించే పరిస్థితి లేదని పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌కు పెళ్లికి వెళ్లడాన్ని అదనుగా చూసుకున్న చందన, ఉమర్‌ను కోరుట్లకు పిలిచింది. ఈ లోపున అక్క దీప్తికి మద్యం తాగించింది. దీప్తి మద్యం మత్తులో ఉండగా ఉమర్‌ను ఇంటికి పిలిచి బీరువాలో ఉన్న 70 తులాల బంగారం, లక్షా 20 వేల నగదుతో ఉడాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దీప్తి లేచి అరవడంతో ఆమె నోటికి చున్నీ చుట్టారు. అయినా ఆమె ప్రతిఘటించడంతో ముక్కుకు కూడా చున్నీ చుట్టి ప్లాస్టర్ వేశారు. దాంతో ఆమె ఊపిరాడక చనిపోయింది. ఈ విషయం పట్టించుకోకుండా చందన, ఉమర్‌తో బయటకు వచ్చేసింది.
కేసు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చందన ఫోన్‌ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చందన బెంగుళూరులో ఉంటున్న తన తమ్ముడికి తాను అక్కను హత్య చేయలేదని వాట్సప్ మెసేజ్ పెట్టింది. కాల్స్‌ను కూడా ట్రాక్ చేసిన పోలీసులు ఆర్మూర్ వద్ద చందన, ఉమర్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. వాళ్లు నేరం ఒప్పుకున్నారు. వీళ్లద్దరితో పాటు ఉమర్ తల్లి, స్నేహితుని మీద కూడా పోలీసులు కేసు బుక్ చేశారు.