
మజ్లిస్ తో అంటకాగుతున్న పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం?
నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? ఎంపీగా పోటీ చేయాలా? హైకమాండ్ నిర్ణయిస్తుంది
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టీకరణ
రాబోయే ఎన్నికల్లోనే కాదు… ఆ తరువాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న బీఆర్ఎస్ తో పొత్తు ఎలా సాధ్యమని, ఆ ఆలోచనకే తావు లేదని ఉద్ఘాటించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా… లేదా ఎంపీగా పోటీ చేయాలా? అనేది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు.
అమెరికాలో పర్యటిస్తున్న బండి సంజయ్ కుమార్ నార్త్ కరోలినా లోని చార్లోటే లోని హిందూ సెంటర్ లో ‘‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’’ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, సోషల్ మీడియా మాజీ కన్వీనర్ వెంకటరమణ,OFBJP Team సభ్యులు అరవింద్ మోదిని, ఆనంద్ జైన్, శ్రీకుమార్ వేల్పుల,శ్యాం సుందర్ పడమటి, సుభాష్, దిలీప్ రెడ్డి, నీఖేత్ సాయిని తదితరులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ ప్రసంగించారు. ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముఖ్యాంశాలు….
కుటుంబ పాలనలో ఉన్నప్పుడు దేశం అన్ని రంగాల్లో దిగజారింది…. అన్నింటా అవినీతి… జవాబుదారీతనం మచ్చుకైనా కనిపించలేదు… అంతా దాపరికం…. దళారీలు… పైరవీలు…. కోటరీ… ఇవే నడిచేవి… ఒక్క కుటుంబం కోసమే ప్రజలు అన్నట్టు అప్పటి పాలకులు వ్యవహరించే వారు…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోంది. కనీసం అవినీతి ఆరోపణలు చేసే సాహసం కూడా చేయలేని పరిస్థితి… వ్యవస్థలో జవాబుదారీతనం…. పారదర్శకత…. 140 కోట్ల భారతీయులే తన కుటుంబంగా భావించి సెలవు తీసుకోకుండా…. రోజుకు 18 గంటలు కష్టపడుతున్న నాయకుడు మోదీ..
80 కోట్ల మంది పేదలకు గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయి…. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ నల్లా నీళ్లు… అవాస్ యోజన కింద పేదల సొంతింటి కల సాకారమవుతోంది.
కరోనా వేళ అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమై… ఆర్థిక పరిస్థితి దిగజారితే…. ఆపదలోనూ అవకాశాలు వెతికిన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ పథకానికి శ్రీకారం చుట్టారు… అప్పుడు ఇతర దేశాలపై ఆధారపడిన దుస్థితి నుంచి నేడు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోంది….
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో పాలన ప్రారంభించిన ప్రధాని… ఇప్పుడు సబ్ కా విశ్వాస్.. సబ్ ప్రయాస్ జోడించి ప్రజల కేంద్రకంగా పాలన కొనసాగిస్తున్నారు… ఆర్ధిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి తీసుకొచ్చారు. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారత్ ను తీర్చిదిద్దబోతున్నారు. భారత్ లో జరుగుతున్న అభివ్రుద్ధిని చూసి ప్రపంచమే అబ్బురపడుతోంది.
మోదీ చేస్తున్న అభివ్రుద్ధిలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని కోరుతున్నా. అందుకోసం ఇండియాలో పెట్టుబడులు పెట్టండి. దేశం కోసం నిరంతరం పాటుపడుతున్న మోదీ సర్కార్ ను మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకోసం మీరంతా రాబోయే ఎన్నికల్లో మోదీ తరపున ప్రచారం చేయాలని కోరతున్నా.
ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నలకు…..
నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? ఎంపీగా పోటీ చేయాలా? అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్ణయమే శిరోధార్యం.
అమెరికాలో సీనియర్ సిటిజన్ కు ఐటీ చెల్లింపుల్లో రిబేట్ ఇస్తారు…. ఇండియాలో కూడా దీనిని అమలు చేసే అంశాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళతా.
ఎన్నికల్లోనే కాదు… ఆ తరువాత కూడా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. అయినా ఎంఐఎంతో అంటకాగుతున్న పార్టీతో పొత్తు ఎలా సాధ్యం?