
ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలియాస్ వెంకట రమణా రెడ్డి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు ఇటీవల ఆయన చేసిన కొన్ని వాఖ్యలతో స్పష్టమైంది. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందనీ, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తానని ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల సందర్భంగా కామెంట్ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసే తన ప్యానెల్‌ను గెలిపించుకున్నారు. దిల్‌రాజుకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉందని ఊహాగానాలకు ఈ కామెంట్లతో బలం చేకూరింది. ఆయన ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా తేలలేదు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఆయనకు ఆసక్తి ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మన సొంతూరు నర్సింగ్‌పల్లిలో ఇప్పటికే ఆయన మాపల్లె ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందూరు తిరుమల పేరిట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ప్రతి నెల పౌర్ణిమ రోజుల పిల్లలకు, గర్భిణులకు ప్రత్యేక ప్రసాదం అందజేస్తారు. పదేళ్ల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా, దిల్‌రాజు బీఆర్ఎస్, లేదా కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ నుంచి రంగంలోకి దిగుతారని చర్చ జరుగుతున్నా, ఆయన కారు వైపే ఎక్కవ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.