
ప్రేమించుకొని పెద్దల అంగీకారం లేదని చాలా మంది జంటలు పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ జంట మేజర్ అయితే పోలీసులు వారికి చట్టపరమైన రక్షణ కల్పించాలి. కొన్ని స్టేషన్లలోనైతే పోలీసులే పెళ్లిళ్లు చేసిన సందర్భాలున్నాయి. అయితే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రేమ పెళ్లిళ్లను కట్టడి ఎలా చేయవచ్చునో పరిశీలిస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల అంగీకారం ఉన్న పెళ్లిళ్లకే గుర్తింపు ఇవ్వాలని నిబంధనను పరిశీలిస్తున్నారు. దీనికి రాజ్యాంగబద్ధత ఎంత మేరకు ఉంటుందోని చూడమని హెల్త్ మినిస్టర్ను పురమాయించారు. గుజరాత్లోని బలమైన పాటిదార్ కమ్యూనిటీ ఈ మధ్య సీఎంను కలిసి ఇలాంటి చట్టం ఒకటి తీసుకురమ్మని కోరారట. దాంతో ఈ కమ్యూనిటీ ఆదివారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో సీఎం పటేల్ మాట్లాడుతూ తాను అదే పనిలో ఉన్నానని చెప్పారు.