
శ్రీయుత కె.చంద్రశేఖరరావు గారు,
గౌరవ ముఖ్యమంత్రి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
హైదరాబాద్.
నమస్కారం
విషయం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కేంద్రాలను స్మృతిచిహ్నాలగా గుర్తించి అభివృద్ధి పర్చుట` హైదరాబాద్లో స్మృతి చిహ్నాలను నిర్మించుట గురించి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మల్లారెడ్డి గూడెం, బొల్లెపల్లి, గుండ్రంపల్లి, బైరాన్పల్లి, మందాపూర్, కూటిగల్లు, కడివెండి, పాలకుర్తి లాంటి అనేక రైతాంగ సాయుధ పోరాట కేంద్రాలలో ప్రజల తరఫున ఏర్పాటు చేసిన చిహ్నాలు శిథిలమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విలీన దినం జరపకుండా ఆనాటి ప్రభుత్వాలు అన్యాయం చేశారని చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నేటి తరాలకు, రాబోయే తరాలకు తెలియజేయడానికి నాటి త్యాగదనుల చరిత్రను పాఠ్యాంశాలలో పొందుపరచబడలేదు. నాటి సాయుధ పోరాట యోధులు ప్రాణాలకు తెగించి నైజాంను గద్దెదించారు. అలాంటి మహానీయులు విగ్రహాలు రాష్ట్ర వ్యాపితంగా వివిధ కూడళ్లలో ఏర్పాటు చేయాలని అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకరావడం జరిగింది. ఐనా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. త్యాగధనులు సమాధులు, స్మృతి చిహ్నాంగా ఉన్న బుర్జులు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని చోట్ల కూలిపోయాయి. వాటిని సుందరీకరణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉన్నది. సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 17వ జరుగు సాయుధ పోరాట వారోత్సవాలను ప్రభుత్వమే అధికారపూర్వకంగా నిర్వహించాలని, రైతాంగ సాయుధ పోరాటాన్ని భావితరాలకు తెలియజేయాలని కమ్యూనిస్టుపార్టీలు ప్రతిసంవత్సరం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎన్నో గొప్పగొప్ప భవంతులు కడుతున్న మీకు సాయుధ పోరాట స్మృతి చిహ్నాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తున్నదో అర్థం కావడం లేదు. కావున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల స్మృతి చిహ్నాలను అభివృద్ధిపరిచి ఆనాటి యోధుల విగ్రహాలను ప్రతికూడలిలలో ఏర్పాటు చేసి, సాయుధ పోరాట చరిత్రను బావితరాలకు అందించేందుకు పాఠ్యపుస్తకాలలో చేర్చాలని కోరుతున్నాను.
అభివందనములతో,
చాడ వెంకటరెడ్డి, Ex.MLA
సిపిఐ, జాతీయ కార్యవర్గ సభ్యులు