
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
విషయం: హోంగార్డు రవీందర్ అత్యహత్య గురించి
తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్ కంటే ఆధ్వాన్నంగా తయారైంది. ముఖ్యమంత్రి నుంచి వార్డు కౌన్సిలర్ దాకా బందోబస్తు కావాలంటే హోంగార్డు కావాలి. కుటుంబాలను పట్టించుకోకుండా ఎస్సై నుంచి ముఖ్యమంత్రి వరకు కంటికి రెప్పలా కాపాడుతుంటే వారిని సమస్యలను పరిష్కారించాలనే సోయి ఏఒక్కరికి లేకపోవడం బాధాకరం.
రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అధికారులు, తోటి సిబ్బంది వేధింపులతో హోంగార్డు రవీందర్ అత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని కలిగిచింది. రవీందర్ భార్య సంధ్య, పిల్లలు మనీశ్ (16), కౌశిక్ (13) వీరికి దిక్కెవరు. ఇంత జరిగిన ఏ ఒక్క మంత్రిగాని, అధికారిని స్పందిచకపోవడం మరింత దారుణం.
రవీందర్ ది అత్మహత్య కాదు ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే. మీ ప్రభుత్వ చేతగానితనంతో నిజాయితీ పరుడైన ఒక హోంగార్డు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం చాలా బాధాకరం. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్యే. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలి. మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి హోంగార్డుల మనోవేదనను అనుభవిస్తూనే ఉన్నారు.
ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా వారి సమస్యలను పరిష్కారించాలనే ఇంగిత జ్ఞానం మీకు లేకుండా పోయింది. పోలీసు, గిడ్డంగులు, జెన్కో , బీఎస్ఎన్ఎల్, ఆర్టీసీ, ఫైర్ శాఖలతో పాటుగా కలెక్టరేట్, కోర్టు భవనాలలో, ఇలా ప్రతీచోటా మనకు ఎదురయ్యే వ్యక్తి హోంగార్డు. ఇలా రాష్ట్రంలో 20,000 మంది హోంగార్డులు కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా, సమయాన్ని చూసుకోకుండా బాధ్యతయుతంగా విధులు నిర్వహిస్తుంటే వారికి ప్రభుత్వం నుంచి వేధింపులు, సకాలంలో వేతనాలు అందకపోవడం వంటివి బహుమానంగా దక్కుతున్నాయి.
కానిస్టేబుల్ తో విధులు నిర్వహిస్తుంటే హోంగార్డులకు ఎటువంటి హెల్త్ స్కీమ్ లేకపోవడం, విధులకు వస్తూ ప్రమాదానికి గురైన సమయాలలో కూడా ఎలాంటి బీమా సౌకర్యం గానీ, మెడికల్ ఫీజు-రీయింబర్స్ కానీ లేకపోవడం విడ్డూరం. సమయానికి జీతాలు రాక పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేక, చేసిన అప్పులకు ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడుతూ బయటికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
మహిళా హోంగార్డుల పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ వీళ్ళు మహిళగా ఎదుర్కొనే సమస్యలే కాక అదనంగా అవమానాలను ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఆయాశాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రసూతి సెలవులు, ఈ సమయంలో ఇచ్చే జీతభత్యాల సౌకర్యం మహిళా హోంగార్డులకు అసలే లేదు.
గతంలో మీరు 2017లో అసెంబ్లీ సాక్షిగా హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానన్న హామీకి దిక్కు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి విలువ లేకుంటే రాష్ట్రంలో పాలన ఉన్నట్లా లేనట్లా. రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సిగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినప్పుడు, వీరిని చెస్తే వచ్చే నష్టం ఏమిటి? డిమాండ్లను పరిష్కారించమని ఎన్నో సార్లు హోం గార్డులు ఉద్యమిస్తే మీ ప్రభుత్వం నుంచి వేధింపులను ఎదుర్కొవాల్సి వచ్చింది తప్ప పరిష్కారం దొరకలేదు.
సీఎం సారూ.. హోంగార్డులను పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్స్టేషన్ హోంగార్డు నాగమణి చేసిన వీడియో వైరల్ అవుతుంది అది చూసి అయిన మీలో మార్పు రావాలి. ఇకనైనా హోంగార్డుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలి. లేని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తాం.
డిమాండ్లు
• రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
• పిల్లల చదువు, వారి భవిష్యత్ కు ప్రభుత్వం అన్ని విధాలు భరోసానివ్వాలి.
• కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందించాలి.
• కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి.
• హోం గార్డుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలి.
• హోంగార్డులను క్రమబద్ధీకరించాలి.
• కారుణ్య నియామకాలను చేపట్టాలి.
ఎ. రేవంత్ రెడ్డి,ఎంపీ – మల్కాజ్ గిరి,టీపీసీసీ అధ్యక్షుడు.