
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి జైలు పాలయ్యారు. 1978లో చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1981లో మంత్రి అయ్యారు. 1995లో ముఖ్యమంత్రి అయిన ఆయన 14 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా రాజకీయ ప్రస్థానం నెరిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇపుడు తొలిసారి జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లారు. కాగా చంద్రబాబు గతంలో గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 2011లో రెండున్నర రోజులు అక్కడి పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఆయన ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. అయితే మహారాష్ట్ర పోలీసులు ఆయనను నిర్బం
ధంలోకి తీసుకొని సరిహద్దుల్లో ఉన్న ఒక భవనంలో ఉంచారు. వెనక్కు వెళ్లిపొమ్మని కోరినా ఆయన వెళ్లనందున నిర్బంధంలోకి తీసుకున్నారు. తర్వాత బలవంతంగా విమానంలో ఎక్కించి పంపారు. కానీ ఆయన మీద ఎలాంటి కేసు పెట్టలేదు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం బేగంపేట విమానాశ్రయం పేరును మార్చాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ధర్నా చేశారు. పోలీసులు అరెస్టు చేసి ఓల్డ్ సిటీలోని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి తర్వాత వదిలేశారు. 2012లో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రైతు సమస్యలపై దీక్ష చేశారు. నాలుగు రోజుల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. కానీ కేసు పెట్టలేదు. ఇలా పలు సందర్భాల్లో పోలీసులు తాత్కాలికంగా ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నా తర్వాత వదిలేశారు. ఎలాంటి కేసు పెట్టలేదు. ఎప్పుడూ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చలేదు. కానీ వైసీపీ హయాంలో ఆయనకు ఆ పరిస్థితి తలెత్తింది.