
సామూహిక రాజీనామాలకు సిద్ధమన్న ప్రజాప్రతినిధులు
జాతీయ రహదారి పై 10జీపీల ప్రజాప్రతినిధుల రాస్తారోకో
ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 లో ఇచ్చిన హామీని నెరవేర్చి ములుగు మండలంలో అంతర్భాగమైన మల్లంపల్లిని ప్రత్యేక మండలం గా గుర్తించాలని రాజకీయ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మల్లంపల్లిలో జాతీయ రహదారిపై 10 గ్రామపంచాయతీల ప్రజా ప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. మండల సాధన జేఏసీ అధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీగా ఇచ్చిన నినాదాన్ని ప్రతి సందర్భంలో మంత్రులు ఎమ్మెల్సీలు హామీలుగా వరాలు ఇచ్చారని, మళ్లీ ఎలక్షన్లు వచ్చిన మల్లంపల్లిని మండలంగా ప్రకటించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మండలాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే మల్లంపల్లి ని కూడా మండలం చేయాలని ఇక్కడి నుంచి ప్రభుత్వానికి ఎర్రమట్టి కారుల నుంచి రాయల్టీ వెళ్తోందని పేర్కొన్నారు. దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పేరు మీద మల్లంపల్లి మండలం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గంటపాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.