
రేపు ఉమ్మడి జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన స్టూడెంట్ జేఏసీ నేతలు
మద్దతు ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు
కాకతీయ యూనివర్సిటీ లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఆరో రోజు కొనసాగింది. వర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలు, విద్యార్థుల మీద పోలీసుల దాడిని నిరసిస్తూ వర్సిటీ స్టూడెంట్ జేఏసీ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం వీసీ పాలనపై కేయూ జాక్ నేతలు ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు. పీహెచ్ డీ లలో అవకతవకలు, అక్రమ నియామకాలు, వీసీ అర్హత వివాదం, వర్సిటీ భూముల కబ్జా తదితర వివరాలను అందులో పొందుపరిచారు. కాగా నిరసన దీక్ష చేపట్టిన విద్యార్థి సంఘాల నేతలకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. రేపటి బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా నిరసన దీక్ష శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామరావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు తదితరులు సందర్శించి, గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. కాంగ్రెస్ నేత కూచన రవళి విద్యార్థులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో స్టూడెంట్ జేఏసీ నేతలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.