
మళ్లా కోవిడ్ భయం కమ్ముకొస్తోందా… కోవిడ్ కొత్త వేరియంట్ ఎరిస్ (ఇఆర్ఐస్) భారత్ లో రెండు నెలల కిందే నమోదైంది. ఈ కొత్త సబ్ వేరియంట్ గ్లోబంతటా వేగంగా వ్యాప్తి చెందుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సబ్ వేరియంట్ మనదేశంలో నమోదై రెండు నెలలు అయినా దాని వ్యాప్తి లేకపోవడంతో అది అంత ప్రమాదకరమైంది కాదని అనుకుంటున్నారు. కానీ వైద్యులు మాత్రం కోవిడ్ వేరియంట్ల పట్ల ప్రభుత్వాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించిన తాజా కోవిడ్-19 వేరియంట్ ని ఇజి.5.1ని ఎరిస్ అని పిలుస్తున్నారు. ఈ వేరియంట్ కు సంబంధించిన ఒక కేసు ఈ ఏడాది మేలో పుణెలో నమోదైంది. ఈ కొత్త సబ్ వేరియంట్ 39 దేశాలలో, అమెరికాలోని 38 రాష్ట్రాలలో గుర్తించారు. ఎక్స్ బి బి వేరియంట్ నుంచి వచ్చినదే ఇజి5.1. ఈ వేరియంట్ గ్లోబల్ స్థాయిలో ఈ ఏడాది మార్చిలోనే గుర్తించారు. దీని ఇన్ఫెక్షన్, తీవ్రతలు చూస్తే యుకె హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పరిశీలనల ప్రకారం ఈ సబ్ వేరియంట్ ఎంతో వేగంగా వ్యాప్తిచెందుతోంది. వారానికి దీని పెరుగుదల 25.51 శాతం ఉంటోందని తెలుస్తోంది. దీని తీవ్రత, వాక్సినేషన్ పనితీరు మీద కూడా ప్రపంచ ఆరోగ్యసంస్థ కసరత్తులు చేస్తోంది. ఇతర కోవిడ్ -19 వేరియంట్లతో పోసిస్తే ఇప్పటివరకూ ఒమెక్రాన్ ఇజి 5.1 సీరియస్ కేసులు గాని, హాస్పిటలైజ్ అయిన కేసులు గాని లేవు. దీనివల్ల మరణాలు కూడా ఏమీ సంభవించలేదు.

ఈ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నా కూడా వాక్సినేషన్ చేయించుకున్న వారిలో దీనివల్ల తీవ్ర అస్వస్థతకు గురయిన సంఘటనలు లేవు. అధిక సంఖ్యలో ఈ కేసులు నమోదైతే అవి మరిన్నిగా పెచ్చరిల్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ లక్షణాలు చూస్తే గొంతునొప్పి, ముక్కుకారడం, ముక్కు దిబ్బళ్లు వేయడం, తుమ్ములు, పొడిదగ్గు, తలనొప్పి,వొళ్లు నొప్పులు వంటివి ఉంటాయని వైద్యలు చెప్తున్నారు. కానీ ఈ వేరియంట్ బారిన పడిన చాలామంది పేషంట్లు జ్వరం, ఊపిరాడకపోవడం వంటి కంప్లైయిట్లేమీ ఇప్పటివరకూ చేయలేదని తెలుస్తోంది. వాక్సినేషన్ చేయించుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది కాకుండా హ్యాండ్ వాష్, సామాజిక దూరం, గుంపుల్లో మసలకుండా ఉండడం, మాస్కు ధరించడం, ఎవరికైనా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలుంటే వాళ్లు బయట తిరగకుండా ఉండడం వంటి ముందొస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.

ఇప్పటికి కొత్త వేరియంట్ సీరియస్ సమస్యగా కనిపించకపోయినా భవిష్యత్తులో ఎలాంటి తీవ్ర పరిణామాలూ తలెత్తకుండా ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. పైన చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్లు వెంటనే వైద్యపరమైన చికిత్స తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. తగిన వైద్య పరీక్షల ద్వారా దీనికి కరక్టు కారణాన్ని వెంటనే తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.