
ముసలవ్వ పుస్తెల తాడు చోరీ చేసిన మహిళ దొంగ
గ్రేటర్ వరంగల్ సిటీలో తెల్లవారుజామున రెండుచోట్ల దొంగతనాలు జరిగాయి. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీమాబాద్, చింతల్ ప్రాంతంలో ఈ చోరీలు జరిగాయి. కొన్ని నెలల క్రితం భర్త చనిపోవడంతో కరీమాబాద్ లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు వినోద ఇంట్లో ఓ మహిళ దొంగ చోరికి పాల్పడింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వినోద ఇంటికి వచ్చి తలుపు కొట్టిన దొంగ.. బాధితురాలి కంట్లో కారం చల్లి మెడలో ఉన్న పుస్తెలతాడు అపహరించుకుపోయింది. పావు తక్కువ మూడు తులాల పుస్తెలు పోయినట్లు వృద్ధురాలు ఏడుస్తూ చెప్పింది. పంజాబీ డ్రెస్ లో వచ్చిన మహిళ దొంగ చుడీదార్, స్కార్ఫ్ కట్టుకొని వచ్చిన వీడియో దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చోరీ అనంతరం దొంగ నిర్మానుష్యంగా ఉన్న గల్లీలో పరుగులు తీస్తూ కనిపించింది. చింతల్ లోని ఓ ఇంట్లో దొంగలు చోరికి యత్నించగా శబ్దానికి దగ్గర్లోని వ్యక్తులు లేవడంతో వచ్చినవారు వెనక్కు తగ్గారు. చెప్పుకోదగ్గ వస్తువులు ఏమి పోలేదని స్థానికులు తెలిపారు. కాగా నగరంలో వరుస చోరీలు జరుగుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు.