
ధర్నా చౌక్ 24 గంటల ఉపవాస దీక్షలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమైన పాయింట్లు..
బీజేపీ నాయకులందరూ 24 గంటల ఉపవాస దీక్షలో పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు.. తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారు. వారికి సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తున్నది.
తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాటం చేసింది రాష్ట్ర నిరుద్యోగ యువత.
9 ఏండ్లుగా నిరుద్యోగ యువత విషయంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వహించింది.
1969లో తెలంగాణ యువత ఉద్యోగాలు, భవిష్యత్ విషయంలో అనేక పోరాటాలు చేశారు.
ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసు తూటాలకు 369 మంది బలయ్యారు. ఆరోజు కాల్చి చంపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థులు చదువు మానేసి.. మాకు తెలంగాణ కావాలి, ఉద్యోగాలు కావాలని పోరాటం చేశారు.
తెలంగాణ రాదేమోనని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదేమోనని 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారు.
నా చావుతోనైనా.. తెలంగాణ వస్తుందేమోనని ఆత్మబలిదానం చేసుకున్నారు.
అందరికంటే ముందు.. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పెట్రోల్ పోసుకున్నాడు.. ఆయనకు ఇంతవరకు అగ్గిపెట్టే దొరకలేదు.
కానీ ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల.. కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి.
ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్, సాగరహారం, వంటావార్పు.. ఇదే ధర్నా చౌక్‌లో ఏండ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారు.
కానీ తొమ్మిదేండ్లుగా నిరుద్యోగ యువత పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
యూనివర్సిటీలు కళావిహీనంగా ఉన్నాయి. హాస్టళ్లలో పందికొక్కులు తిరుగుతున్నాయి. తెలంగాణ వస్తే.. వర్సిటీల్లో ఖాళీ లెక్చరర్ల పోస్టులు, స్కూళ్లు, కాలేజీల్లో టీచర్ల పోస్టులు భర్తీ అవుతాయని, తమకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు.
ఏండ్ల తరబడి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసులతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నది.
పరీక్షలు నిర్వహించినా.. ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై.. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ఆగమైంది.
తల్లిదండ్రుల వద్ద ఉన్న బంగారం అమ్మి, అప్పులు తీసుకొని నగరంలో కోచింగ్ తీసుకొని, వీధి లైట్ల కింద, పార్కుల్లో పస్తులు ఉండి చదువుకొని పరీక్షలు రాస్తే.. ప్రశ్నపత్రాలు లీకై.. 35 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు ఆగమయ్యాయి.
కేసీఆర్ ఈ పాపం ఎవరిది..?
35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే వారిని గాలికొదిలేశారు. నిరుద్యోగుల జీవితాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా..?
దానిపై పోరాటం చేస్తే.. గతంలో మా అధ్యక్షుడు బండి సంజయ్ మీద కేసులు పెట్టారు. సిగ్గు ఉండాలి మీ ప్రభుత్వానికి.. మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి.
అవినీతి కుంభకోణాలు మీవి, చేతకాని తనం మీది, లీకేజీలు మీవి? కేసులు మా మీద పెడతారా?
అసెంబ్లీలో కేసీఆర్ ఏం చెప్పారు.. డీఎస్సీ వేస్తాం.. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది?
టీచర్ పోస్టులు 25 వేలు ఖాళీలు ఉన్నాయి కదా? ఏమైంది? తొమ్మిదేండ్లుగా డీఎస్సీ వేయలేదు ఈ ప్రభుత్వం.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని గ్రామాలకు వస్తారు.. కేసీఆర్. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు.
ఉద్యోగం ఇస్తా.. ఉద్యోగం ఇవ్వకుంటే.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా.. 3016 ఇస్తానన్నావ్ ఏమైంది? ఎక్కడ పోయింది 3016?
నిరుద్యోగ భృతి వస్తుందేమోనని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూశారు.
భృతి వస్తే.. కొత్త రబ్బర్ చెప్పులు కొనుక్కుందామని, చిరిగి పోయిన ప్యాంట్ స్థానంలో కొత్త జీన్స్ ప్యాంట్ కొనుక్కుందామనుకున్నారు.
కానీ నేడు తల్లితండ్రులకు మొఖం చూపించుకోలేక.. ఆకలితో బాధపడుతూ.. కనీసం తినడానికి తిండి లేని స్థాయిలో అనేక మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే.. కేసీఆర్ వారికి వెన్నుపోటు పొడిచారు తప్ప. న్యాయం చేయలేదు.
ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు పదం అనేది ఉండదని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు.
కానీ మొన్న ఏం జరిగింది. రవీందర్ అనే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు.
కేసీఆర్ రవీందర్ ఆత్మహత్య మీ పాపం కాదా? రెండు నెలలుగా జీతం రాకపోతే.. అడిగి అవమానంతో భార్యాపిల్లలకు మొఖం చూపించలేక.. ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయనది ఆత్మహత్య కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య. మీరు హామీ ఇచ్చి మాట తప్పారు కాబట్టి ఆ బాధ్యత మీదే.
పరిశ్రమలు తెరుస్తామని, చెప్పారు వరంగల్‌లో రెయిన్స్ పరిశ్రమ, కాగజ్‌నగర్‌లో పేపర్ మిల్లు సహా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలు తెరుస్తామని, ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఒక్క పరిశ్రమ తెరవలేదు.
ప్రధాని మోడీ కృషితో దేశంలోని అనేక రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయి.
రాష్ట్రానికీ వస్తున్నాయి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం మేమే తెస్తున్నామని చంకలు గుద్దుకుంటున్నది.
ఎవరైనా వ్యాపారం చేయాలంటే, సంస్థలు ప్రొడక్షన్ చేసుకోవాలంటే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఇవ్వనిదే.. కొత్త పరిశ్రమలు ఇక్కడ పెట్టే పరిస్థితి లేదు.
నిధులు, నీళ్లు , నియామకాలు ఏమైపోయాయి? నీళ్లు.. కేసీఆర్ మాటలు నీటి మూటలైపోయాయి కానీ.. తెలంగాణకు నీళ్లు రాలేదు. చేపట్టిన చేపడుతున్న ప్రాజెక్టుల్లో కమీషన్లతో కుమ్మక్కై ప్రజాధనం కొల్లగొట్టారు.
నియామకాలు ఎవరికి వచ్చాయి.. కల్వకుంట్ల కుటుంబానికి నియామకాలు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. నిధులు ఎవరికొచ్చాయంటే.. బీఆర్ఎస్ నాయకులుకు, అవినీతిపరులకు వచ్చాయి..
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇవాళ అప్పులపాలై దివాళ తీసే స్థితికొచ్చింది.
ఏ రంగం తీసుకున్నా.. ఏమున్నది గర్వకారణం.. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ అవినీతి తప్ప ఏం కనిపించదు. కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ యువతకు అన్యాయం చేసింది.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ యువతకు అన్యాయం జరుగుతోంది.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ప్రతీ నెల 70 నుంచి 80 వేల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తూ.. ప్రధాన మంత్రి స్వయంగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారు. గతంలో ఇలా ఎవరైనా ఇచ్చారా?
ఉద్యోగాలు కల్పించే విషయంలో మోడీ గారికి ఉన్న కమిట్మెంట్ను యువత అర్థం చేసుకోవాలి. ముద్ర, స్టాండప్, స్టార్టప్ లాంటి పథకాల కింద లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
అన్ని రకాల ఉత్పత్తలు పెంచి.. కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో పరిశ్రమలు పెట్టడం కోసం.. వ్యాపారం చేయడం కోసం భారత్.. కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
మోడీ ప్రభుత్వంపై విశ్వాసంతోనే దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. మా దేశానికి కావాల్సిన వస్తువులు.. మా దేశ యువత తయారు చేయాలని.. మోడీ ప్రభుత్వం దిగుమతులను నియంత్రిస్తున్నది.
అనేక ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బీజేపీ బలపర్చి మోసపోయింది.
కేసీఆర్ కుటుంబం, మంత్రులు జిల్లాలో పర్యటించాలంటే.. నిరుద్యోగులను, యువతను అరెస్ట్ చేస్తున్నారు. మొన్న వరంగల్‌లో నిరుద్యోగ యువత కాకతీయ వర్సిటీలో ఆందోళన చేస్తే.. వారిని పోలీస్ స్టేషన్లో కమిషనర్ ముందు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇష్టారాజ్యాంగా కొడితే.. చేతులు విరిగాయి.
సమైఖ్య ఆంధ్రాలో కూడా.. అరెస్ట్ తర్వాత టాస్క్‌ఫోర్స్ పోలీసులతో విద్యార్థులను ఎప్పుడూ కొట్టిన దాఖలాలు లేవు.
ఏ యువకులైతే.. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాటం చేశారో.. వాళ్లు ఈరోజు కండ్లు తెరిచారు కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని , మీ ప్రభుత్వాన్ని పాతరేస్తారు జాగ్రత్త.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి, కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తూ.. గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్.
కానీ నిరుద్యోగ యువతకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అన్యాయం జరిగిందనేది. కాబట్టి ఈ రెండు పార్టీలను యువత క్షమించదు. కచ్చితంగా బుద్ధి చెప్తారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుంది.
నేను ఈ ధర్నా చౌక్ నుంచి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం చేశారో చూశారు.
ఇప్పుడు నిరుద్యోగులు, యువత కోసం పనిచేసే బీజేపీకి మద్దతు తెలిపాలి.
నిరుద్యోగుల కోసం బీజేపీ పోరాటం చేస్తే.. కేసులు పెట్టి, జైళ్లకు పంపారు. కానీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోం.