
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో దళిత బంధు పథకం కింద లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సభలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. గ్రామంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామానికి చెందిన 250 మంది దళితులతో పాటు, బుడగ జంగాల వారు హాజరయ్యారు. అసలైన దళితులకు కాకుండా వలస వచ్చిన బుడగజంగాలకు దళిత బంధు పథకం ఎలా అమలు చేస్తారంటూ కొందరు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. మాటా మాటా పెరిగి ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో దళితులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. అనంతరం బుడగ జంగాల వారిపై దళితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.