
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని భూమి కోల్పోయిన నిర్వాసిత రైతు అనంత అల్లాజీ (45) ఎనమిది ఏండ్ల తర్వాత అతి తక్కువ పరిహారం ప్రకటించడాన్ని తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు కుమ్మెర గ్రామానికి చెందిన అనంత అల్లాజీ (45) నలుగురు అన్నదమ్ములకు కుమ్మెర శివారులో 19 ఎకరాల సాగు భూమి ఉంది.
బిజినపల్లి మండలం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్, కుమ్మెర వద్ద నిర్మిస్తున్న పంపు హౌజ్ కోసం నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఐదు ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బోరుబావులతో సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు గుట్ట ప్రాంతంగా చూపించి ఎకరాకు రూ.2.40 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. దీనిపై కుమ్మెర గ్రామానికి చెందిన 8 మంది రైతులు కోర్టును అశ్రయించారు.ఆగస్ట్ 14న హైకోర్టు ఆర్డర్ ప్రకారం 19 ఎకరాలను రూ. రూ.2.40 లక్షల చొప్పున తీసుకుంటున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారు.నోటీసులు అందుకున్న అల్లాజీ కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురైంది. ప్రాజెక్టుకు ఐదు ఎకరాలే అవసరం అని చెప్పి 19 ఎకరాలు తీసుకోవడం ఏంటని బాధిత రైతులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇప్పుడూ అప్పుడూ అంటూ దాటేసిన అధికార పార్టీ లీడర్లు అవార్డు పాస్ కాకుండా, పరిహారం ఇవ్వకుండానే మెగా కంపెనీ భూమిని స్వాధీనంలోకి తీసుకుంది. పరిహారం గురించి అడిగితే కంపెనీ యాజమాన్యం బెదిరించిందని ఆరోపించారు. అధికారులు, అధికార పార్టీ నేతలు తమను మోసగించి ఎకరాకు అతి తక్కువ పరిహారం ఇచ్చేలా చేశారన్న ఆవేదనతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య అంజనమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు