
“కేవీపీ చెప్పాడని కొంతమంది అధికారులను నియమించుకున్నారు. మీరు మీరు చీకట్లో పంచుకుని నా వెనక కేవీపీ ఉన్నారని మాట్లాడుతారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ల దగ్గర తాకట్టు పెట్టింది మీరు..మీరా నా గురించి మాట్లాడేది” అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. నువ్వు మీ అయ్యా నా ఎడమకాలి చెప్పుకు కూడా సరిపోరని విమర్శించారు. బుధవారం హనుమకొండలో 17న సాయంత్రం తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయ భేరి సభకు సంబంధించి నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
“సమైక్యవాదులతో అంతకాగుతోంది మీరు…అమరవీరుల స్థాపం ప్రారంభించి వంద రోజులు కాకముందే పగుళ్లు పట్టాయి. ఆ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన మీరా నా చిత్తశుద్ధిని శంకించేది. తెలంగాణను ఆదాయ వనరుగా మార్చుకున్నారు తండ్రీ కొడుకులు…తెలంగాణ సంపదను కొడుకులు కొల్లగొడుతున్నారు. పార్టీలో కూడా తెలంగాణ పేరును తొలగించిన ద్రోహులు కేసీఆర్, కేటీఆర్” అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేటీఆర్, కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం నేను కొట్లాడిన అనడానికి మాజీ గవర్నర్ నరసింహన్ సజీవ సాక్ష్యమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.