
నిరుద్యోగ సమస్యపై బీజేపీ తలపెట్టిన 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చివర్లో ఉద్రిక్తంగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో బీజేపీ నేతలు ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్ష ప్రారంభించారు. గురువారం ఉదయం వరకు దీక్ష కొనసాగించాలనుకున్నారు. కానీ పోలీసులు పర్మీషన్ సాయంత్రం 6 గంటల వరకే ఉందని, కార్యక్రమం ముగించాలని నేతలకు చెప్పారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష విరమించే ప్రసక్తే లేదని పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలంతా కిషన్ రెడ్డిని చుట్టుముట్టి పోలీసులు ఆయన వద్దకు వెళ్లకుండా దిగ్బంధనం చేశారు. దాంతో కాసేపు ఆగిన పోలీసులు మరింత మంది బలగాన్ని తీసుకువచ్చారు. కిషన్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో విపరీతమైన తోపులాట జరిగింది. మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి అడ్డుపడ్డారు. అయినా పోలీసులు అందరినీ లాగి పడేసి కిషన్ రెడ్డిని అరెస్టు చేశారు.