
ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గురువారం ఉదయం గవర్నర్ తమిళసై బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజ్‌భవన్ నుంచి వెలువడిన ప్రకటన ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్టు గవర్నమెంట్ సర్వీస్) బిల్–2023కు ఆమోదం తెలపడంతోపాటు ఆమె ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు కూడా చెప్పారు.
అసెంబ్లీలో బిల్లుకు ఓకే చేసి గవర్నర్ తమిళసై ఆమోదం కోసం పంపినపుడు ఆమె కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సర్కారుకు కోపం కూడా వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తనకు బిల్లు విషయంలో కొన్ని అనుమానులున్నాయనీ, ఇవి ఉద్యోగుల మంచి కోసమేనని చెప్పారు. 10 సందేహాలు వ్యక్తం చేశారు. వీటిపై ప్రభుత్వం తగినంత క్లారిటీ ఇచ్చిందనీ, దాంతో తాను సంతృప్తి చెందానని గవర్నర్ తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య సత్సంబంధాలు నెలకొన్న విషయం తెలిసిందే.