
సీటెల్‌లో కొద్ది నెలల క్రితం ఒక ఘోరం జరిగింది. తెలంగాణకు చెందిన అమ్మాయిని పోలీసు వాహనం గుద్ది చంపింది. ఈ యాక్సిడెంట్ ఈ ఏడాది జనవరి 23న జరిగింది. అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన జాహ్నవి కందుల యాక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోయింది. ఆమెకు 23 ఏళ్లు. 2021లో చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాది డిసెంబర్‌తో ఆమె చదువు పూర్తవుతుంది.
కాగా ఈ యాక్సిడెంట్ సందర్భంగా అందుకు కారణమైన పోలీసు ప్రవర్తన భారతీయులను అవమానించే విధంగా ఉంది. జనవరిలో జరిగిన ఈ యాక్సిడెంట్‌తో తాజాగా సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఒక వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. యాక్సిడెంట్‌కు కారణమైన డేనియల్ ఆడరర్ అనే పోలీసు ధరించిన బాడీ వేర్ కెమెరాలోని ఫుటేజీని పోలీస్ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో పెట్టింది. దాంతో ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన చర్చ మరోసారి చర్చకు వచ్చింది. ట్రాన్స్పరెన్సీ పేరుతో డిపార్ట్మెంట్ వీడియోను బహిర్గతం చేసింది.
యాక్సిడెంట్ అయిన రోజు డేనియల్ ఒక మిత్రునికి ఫోన్ చేసి ‘‘అమ్మాయి చనిపోయింది. పెద్ద పట్టించుకునే విషయం కాదు. 11 వందల డాలర్ల చెక్ రాస్తే సరిపోతుంది. సాధారణ మహిళ. 26 ఏళ్లు ఉండవచ్చు”అంటూ పెద్దగా నవ్వుతూ చేసిన సంభాషణ అక్కడి ప్రజల్ని షాక్‌కు గురి చేస్తోంది. అంతేకాదు ఆయన ఈ యాక్సిడెంట్‌కు నేను క్రిమినల్ ట్రయల్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదంటూ తేలిగ్గా మాట్లాడడం కూడా రికార్డయి ఉంది.
జరిగిన సంఘటనపై సీటెల్ పోలీస్ గిల్డ్ విచారణ చేపట్టినపుడు డేనియల్ చాలా తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించారు. 25 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన రోడ్డుపై 74 మైళ్ల వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. డేనియల్ మాత్రం తాను 50 మైళ్ల వేగంతో ఉన్నానని చెప్పారు. ఒక క్రాస్ రోడ్డులో జరిగిన యాక్సిడెంట్లో డేనియల్ హారన్ మోగించినప్పటికీ వేగం తగ్గించకుండా ముందుకు వచ్చిన క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై స్థానిక పౌర సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.